● తప్పిన ప్రాణాపాయం
● రూ.లక్షల విలువ చేసే ఆస్థి నష్టం
లింగాల: మండలంలోని సూరాపూర్‌లో పండుగ పూట విషాదం నెలకొంది. వంట గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన గురువారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. సూరాపూర్‌లో గ్రామానికి చెందిన ముష్టిపల్లి వెంకటస్వామి కుమారుడు మణికంఠ వంట గ్యాస్ సిలిండర్ పొయ్యికి పెట్టేందుకు దానిపై ఉన్న మూతను తొలగించడంతో ఒక్కసారిగా గ్యాస్ లీకై ంది. దానిని అదుపు చేసేందుకు పొయ్యి రెగ్యులేటర్‌ను పెట్టినప్పటికీ గ్యాస్ లీక్ ఆగకపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో భయాందోళనలకు గురైన ఇంటి వారు బయటకు పరుగు తీశారు. ఈ ప్రమాదంలో ఇంటిలో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. రూ.50 వేల నగదుతో పాటు 5 తులాల బంగారం, 60 తులాల వెండి, తిండి గింజలు, భూములకు సంబంధించిన పాసు పుస్తకాలు, విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు పూర్తిగా కాలిపోయాయి. గ్యాస్ లీకై న సమయంలో పక్కనే ఫ్రిజ్ ఉన్నట్లు తెలిసింది. ఇంటి యజమాని ముష్టిపల్లి వెంకటస్వామి స్వల్ప గాయాలతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. మండల కేంద్రంలోని సీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్‌గౌడ్ ఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని సర్పంచు ఆంగోతు శేఖర్ పరామర్శించారు.


