విద్యాసంస్థల పరువు తీసేలా ప్రవర్తించొద్దు | - | Sakshi
Sakshi News home page

విద్యాసంస్థల పరువు తీసేలా ప్రవర్తించొద్దు

Mar 12 2026 8:41 AM | Updated on Mar 12 2026 8:41 AM

నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

వెల్దండ: విద్యాసంస్థల పరువు తీసేలా వ్యవహరిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ సూచించారు. వెల్దండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన బాలికల గురుకుల పాఠశాలలను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. తప్పనిసరిగా ప్రభుత్వం అందించిన కామన్‌డైట్‌ మెనూ పాటించాలన్నారు. విద్యార్థులకు సరిపడా ఆహార పదార్థాలు అందించాలని సిబ్బందికి సూచించారు. నాణ్యమమైన ఆహార పదార్థాలను వంటలకు ఉపయోగించాలన్నారు. విద్యార్థులతో మాట్లాడి వంటలు ఎలా ఉన్నాయి, ఆహారం రుచిగానే అందిస్తునారా అని ఆరాతీశారు. సాంఘిక గురుకుల పాఠశాలలో బాలికలతో కలిసి సహపంక్తి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో బోధన విధానం, విద్యార్థులక సౌకర్యాలు, భౌతిక వసతులు, క్రమశిక్షణ, నిర్వహణ పరిస్థితులను వివరంగా పరిశీలించారు. అంతకుముందు కలెక్టర్‌ ఉపాధ్యాయునులతో మాట్లాడుతూ.. గురుకులాల ఉపాధ్యాయులు తమ బాధ్యతలను నిబద్ధతగా నిర్వర్తించి, విద్యార్థుల విద్యాభ్యున్నతికి మాత్రమే కృషి చేయాలన్నారు. విద్యాసంస్థ, పాఠశాల పరువు తీసేలా, ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించరాదని హెచ్చరించారు. గురుకులాల్లో ఎమైనా సమస్యలు ఉంటే, వాటిని తక్షణమే ఉన్నతాధికారులు, తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యా, వ్యక్తిత్వ, నైతిక అభివృద్ధికి మరింత కృషి చేయాలని, గురుకులాల్లో క్రమశిక్షణ, నాణ్యతా ప్రమాణాలను పాటించాలని కలెక్టర్‌ ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు హితవు పలికారు. ఉపాధ్యాయుల అంతర్గత విభేదాల కారణంగా విద్యాసంస్థల పరువు తీయకూడదన్నారు. ఇటీవల కేజీవీబీలో జరిగిన ఘటనలపై కొంతమందిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా టర్మినేషన్‌ చేశామని సూచించారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలి తప్పా.. డ్డుపైకి విద్యార్థులను పంపడమేంటని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఉపాధ్యాయుల సమస్యలుంటే బయట పరిష్కరించుకోండి.. పాఠశాలల్లో సమస్యలు సృష్టించి విద్యార్థులకు ఆటంకం కలిగించొద్ద ఆదేశించారు. ఇకపై ఇలాంటి విషయాలపై సహించబోమన్నారు. విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతున్నందున వారి విద్యాభ్యాసంపై దృష్టిపెట్టాలని సూచించారు. కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్‌రెడ్డి, వెల్దండ తహసీల్దార్‌ కార్తీక్‌కుమార్‌, ఎంపీడీఓ కృష్ణయ్య, సర్పంచ్‌ మట్ట యాదమ్మ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement