జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): తీర్థ యాత్రలకు వెళ్లేవారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిందని మహబూబ్‌నగర్ డీపీఆర్‌ఓ శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం డీపీఆర్‌ఓ కార్యాలయంలో ప్రత్యేక ప్యాకేజీలను ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు వివరాలతో కూడిన బ్రౌచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఏప్రిల్ 28 నుంచి జూన్ 12 వరకు 4 ప్రత్యేక ప్యాకేజీలను ‘భారత్ గౌరవ్ టూరిస్టు రైలు’ ద్వారా హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందులో అయోధ్య– కాశీ : బైద్యనాథ్ ధామ్ దర్శన్ యాత్ర, పూరి కోణార్క్– బైద్యనాథ్ ధామ్– వారణాసి అయోధ్య– ప్రయాగరాజ్, హరిద్వార్– మాతా వైష్ణోదేవి– రిషికేష్ యాత్ర, అరుణాచలం– చిదంబరంతో దివ్య దక్షిణ యాత్రలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ యాత్రలో రైలు, బస్సు, హోటల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం) సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో టూరిజం అసిస్టెంట్ మేనేజర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


