బస్టాండ్‌ ఉన్నా.. తప్పని వెతలు | - | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌ ఉన్నా.. తప్పని వెతలు

Mar 12 2026 8:41 AM | Updated on Mar 12 2026 8:41 AM

దేవరకద్రలో బస్సుల రాకపోకలు లేక నిర్మానుష్యంగా మారిన బస్టాండ్‌

దేవరకద్ర: ఆర్టీసీ బస్టాండ్‌ ఉన్నా.. బస్సులు లోపలికి రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు తప్పడం లేదు. బస్సులన్నీ ప్రధాన రోడ్డుపై నుంచే వెళ్తుండడంతో ప్రయాణికులు ఎండకు, వానకు రోడ్లపైనే వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనిపై స్పందించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. దేవరకద్ర నియోజకవర్గ కేంద్రం నుంచి నిత్యం మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌, నారాయణపేట, మక్తల్‌, ఆత్మకూర్‌, మంత్రాలయం, రాయిచూర్‌, సింధనూర్‌, గంగావతి, హుబ్లీ, యాద్గిరి, దావణగెరె, బాగల్‌కట్‌, లింగ్సూగూర్‌తో పాటు పలు ప్రధాన పట్టణాలకు వందలాది బస్సులు సర్వీసులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇంతటి రద్దీ ఉన్న దేవరకద్రలో ఏడాదిన్నరగా బస్టాండ్‌ మూత పడింది. దీనికి కారణం ఆర్వోబీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ సమస్య ఉత్పన్నమైంది. ఆర్వోబీ ప్రారంభం కాకముందు బస్సుల రాకపోకలతో కళకళలాడిన బస్టాండ్‌ ఇప్పుడు దైన్యస్థితిలో వెలవెలబోతుంది. బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచి పోవడంతో బస్టాండ్‌లోని షాపులన్నీ మూతపడ్డాయి. బస్టాండ్‌ బయట, చుట్టుపక్కల వ్యాపార కేంద్రాలన్నింటిని మూసి వేసి ఇతర ప్రాంతాలకు తరలించారు. దీంతో బస్టాండ్‌ ఆవరణ నిర్మానుష్య ప్రాంతంగా దర్శమిస్తోంది.

యూటర్న్‌ లేకపోవడంతో..

దేవరకద్రలో నిర్మించిన ఆర్వోబీకి టాకీస్‌ వైపు ఇటీవల కొత్తగా సీసీ రోడ్డు వేశారు. మరోవైపు పాత రోడ్డుపైనే వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఆర్వోబీకి సమీపంలో యూటర్న్‌ లేకపోవడం వల్ల బస్సులు బస్టాండ్‌లోకి రాని పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీ నిధులతో సర్వీసు రోడ్లు వేయడానికి ఇటీవల శంకుస్థాపనలు చేశారు. ఈ పనులు పూర్తయితే సర్వీసు రోడ్లు బాగుపడతాయి కానీ బస్సుల రాకపోకలకు అనువుగా మారుతుందా అనే ప్రశ్న తలెత్తుంది.

పరిశీలనలకే పరిమితం

ఆర్టీసీ అధికారులు పలుమార్లు వచ్చి పరిశీలించి, ప్రయాణికులకు తాత్కాలికంగా షెల్టర్‌ను ఏర్పాటు చేసి బస్సుల రాకపోకలకు అనువుగా రోడ్లను మారుస్తామని చెప్పారు. కానీ ఆచరణలో మాత్రం అమలు చేయలేదు. అలాగే ప్రస్తుతం రిక్వెస్ట్‌ స్టాప్‌లు ఉన్న చోట ప్రయాణికులకు కనీస సౌకర్యాలను కూడా కల్పించకపోవడంతో బస్సుల కోసం వేచి ఉండే వారు నానా ఇబ్బందుల పాలవుతున్నారు. వేసవి కాలం ప్రారంభం కావడంతో కనీసం నీడ లేక ప్రయాణికులు ఎండలోనే నిలబడే పరిస్థితి ఉంది. ఇక చిన్న పిల్లలతో వచ్చే మహిళలు పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది. దీనికితోడు ప్రయాణికులు రోడ్లపై నిలబడడం, బస్సులు రోడ్డుపైనే ఆపుతుండడంతో ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి దేవరకద్ర బస్టాండ్‌ విషయంలో తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే రిక్వెస్ట్‌ స్టాప్‌లో అయిన తాత్కాలిక షెల్టర్లు వేసి తాగునీటిని అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది.

దేవరకద్ర బస్టాండ్‌లోకి రాని బస్సులు

రోడ్డుపైనే ప్రయాణికుల ఎదురుచూపులు

మహిళలు, పిల్లలు,

వృద్ధులకు తప్పని పాట్లు

పరిష్కారం చూపని ఆర్టీసీ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement