అడ్డాకుల: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న మహబూబ్‌నగర్ డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు శుక్రవారం మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి దాటిన తర్వాత పొన్నకల్ స్టేజీ సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారి డివైడర్‌ను ఢీకొని అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లి లారీని ఢీ కొట్టింది. దీంతో కొత్తకోట మండలం వడ్డెవాటకు చెందిన లారీ డ్రైవర్ నందిపేట రవి(35), కొత్తకోటకు చెందిన లారీ సహాయకుడు నాగన్న(38) లారీ క్యాబిన్‌లో ఇరుక్కుని సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన ఆర్టీసీ డ్రైవర్ పురుషోత్తం (58) చికిత్స పొందుతూ జనరల్ ఆస్పత్రిలో మృతి చెందారు. ఈ ఘటనలో పదిమందికి పైగా గాయాలయ్యాయి. కాగా.. ఇటీవల కాలంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల్లో ఎలాంటి పొరపాటు చేయని వాహనాల్లో ఉన్న వారు బలైపోతున్నారు. శుక్రవారం పొన్నకల్ స్టేజీ వద్ద అదుపు తప్పింది ఆర్టీసీ బస్సు అయితే.. ఎలాంటి సంబంధం లేని లారీ డ్రైవర్, మరొకరు ప్రాణాలు కోల్పోయారు. హైవేపై ఇటీవల ఒక రోడ్డుపై అదుపు తప్పే వాహనాలు నేరుగా పక్క రోడ్డు మీదకు దూసుకెళ్తున్నాయి. ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొడుతున్నాయి. దీనివల్ల రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడం వల్ల మృతుల సంఖ్య పెరుగుతోంది. అలాగే జనవరి 19న జానంపేట వద్ద బొలెరో ట్రాలీ వాహనం వేగంగా వెళ్తూ అదుపు తప్పి పక్క రోడ్డు మీదకు దూసుకెళ్లి కారును ఢీకొట్టింది. కారులో ఉన్న తల్లి, కూతురు దుర్మరణం చెందారు. ఇందులో కారులో ఉన్న వారిది ఎలాంటి తప్పు లేదు. అయినా ఎవరో చేసిన తప్పుకు బలయ్యారు. ఇలాంటి ఘటనలు తరుచు చోటు చేసు కుంటున్న క్రమంలో ఒక రోడ్డుపై అదుపు తప్పే వాహనాలు పక్క రోడ్డు మీదకు దూసుకెళ్లకుండా చేపట్టాల్సిన చర్యల గురించి రహదారి నిర్వాహకులు, పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరముంది.
పొన్నకల్ స్టేజీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
డివైడర్ దాటి అవతలి వైపు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ఎవరో చేసిన తప్పులకు ప్రాణాలు కోల్పోతున్న అమాయకులు


