మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 20 మున్సిపాలిటీలు ఉన్నందున రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో అధికారులు పూర్తి బాధ్యతతో పనిచేయాలని స్పష్టం చేశారు.
● వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కొన్ని ఇళ్లు ఎల్–2, ఎల్–3 రిజెక్షన్ల కారణంగా నిలిచిపోయి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించుకునేలా అధికారులు ఈ అంశాన్ని సమీక్షించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. రోడ్లు, కాల్వల నిర్మాణ పనులకు చిన్నపాటి అడవులు అడ్డుగా రావడంతో అటవీ శాఖ అనుమతులు ఇవ్వక నిలిచిపోయాయని తెలిపారు. దీని కారణంగా వనపర్తి జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారానికి అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు కలిసి సంయుక్త సర్వే నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
● ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ ధరణి పోర్టల్‌కు సంబంధించిన కొన్ని భూ సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, రైతులు, భూ యజమానులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
● అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో పోడు భూములను సాగు చేస్తున్న రైతులు వ్యవసాయం చేయడానికి అటవీ శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందన్నారు. దీని కారణంగా ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం అమలులో ఆలస్యమవుతుందన్నారు. పోడు భూముల్లో హార్టికల్చర్ పంటలు సాగు చేయడం ద్వారా రైతులకు మంచి లాభం కలుగుతుందని, అదే సమయంలో అటవీ శాఖకూ ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయం వ్యక్తం చేశారు.
● రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం త్వరలోనే ప్రతి పంచాయతీకి రూ.45 వేల విలువైన స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేయనుందన్నారు. ముఖ్యంగా కబడ్డీ, ఖోఖో ఆటలకు సంబంధించిన కిట్లు, మ్యాట్లు వస్తాయని పేర్కొన్నారు.
● దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరిపితే కార్యక్రమాల అమలు మరింత సమర్థవంతంగా జరుగుతుందన్నారు.


