మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలో దోమల బెంబేలెత్తిస్తున్నాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడంతో పాటు ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారం వేస్తుండడమే ప్రధాన కారణం. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో దాదాపు మూడు లక్షలకు పైగా జనాభా ఉంది. ముఖ్యంగా మురికివాడలుగా పేరొందిన కిద్వాయిపేట, వీరన్నపేట, ఎర్రమన్నుగుట్ట, మదీనా మసీదు, టీడీగుట్ట, బండ్లగేరి, కిసాన్‌నగర్, కురిహినిశెట్టికాలనీ, హనుమాన్‌నగర్, మోతీనగర్, షాషాబ్‌గుట్ట, క్రిస్టియన్‌కాలనీ, బోయపల్లిగేట్, మోనప్పగుట్ట, సంజయ్‌నగర్, మేకలబండ, రామయ్యబౌలి, శివశక్తినగర్, పాతపాలమూరుతో పాటు 14 విలీన గ్రామాలలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. చాలా చోట్ల ఓపెన్ నాలాలు, దెబ్బతిన్న డ్రెయినేజీలే కనిపిస్తున్నాయి. దీనికితోడు అన్ని డివిజన్లలో ఓపెన్ ప్లాట్లను చుట్టుపక్కలవారు చెత్తాచెదారంతో నింపేస్తున్నారు. మురుగు కాల్వ ల్లోనూ ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు పడేస్తున్నారు. ఈ ప్రాంతాలు దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. సాయంత్రం అయిందంటే చాలు ఇంట్లోకి వచ్చి కాటు వేయడంతో కొందరు రోగాల బారిన పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో దోమ తెరలు వాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
అధికారులు చర్యలు తీసుకుంటున్నా..
నగరంలోని వివిధ బహిరంగ ప్రదేశాలు, ఓపెన్ ప్లాట్లు, ముఖ్య కూడళ్లలో చెత్త వేయొద్దని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది తరచూ ఇల్లిల్లూ తిరిగి అవగాహన కల్పిస్తున్నా ప్రజల నుంచి సరైన స్పందన రావడం లేదు. కేవలం స్వచ్ఛ ఆటోలకు మాత్రమే వేరు చేసిన తడి, పొడి చెత్త ఇవ్వాలని సూచిస్తున్నా ఆశించిన స్థాయిలో మార్పు కానరావడం లేదు. ఇదిలా ఉండగా పారిశుద్ధ్య నిర్వహణకు ఈసారి (2025–26 ఆర్థిక సంవత్సరంలో) ఏకంగా రూ.8.50 కోట్లు వెచ్చించారు. ఇందులో దోమల నివారణకు ఫాగింగ్ కోసమే సుమారు రూ.పది లక్షలు ఖర్చు చేశారు. కీమోపాస్ రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. దీనికోసం ఈ ఏడాది సుమారు రూ.లక్ష విలువజేసే 20 హ్యాండ్ పంప్ స్ప్రేలను కొనుగోలు చేశారు. దీనిని ఓపెన్ నాలాలు, డ్రెయినేజీలలో పిచికారీ చేయడానికి ఒక్కో డివిజన్‌కు ఇద్దరు సిబ్బందిని కేటాయించారు. ఫాగింగ్ చేసే నాలుగు వాహనాలకు ప్రతినెలా డీజిల్, పెట్రోల్‌కు రూ.1.50 లక్షలు వెచ్చిస్తున్నారు. ఇంత చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడం లేదు.
పాల్‌సాబ్‌గుట్ట ప్రాంతంలో ఫాగింగ్ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది(ఫైల్)
నగరంలో ఎక్కడబడితే అక్కడ అపరిశుభ్రత వాతారణం
ఓపెన్ నాలాలు, అస్తవ్యస్త డ్రెయినేజీలతో దోమలు వృద్ధి
ఈ ఏడాది పారిశుద్ధ్య నిర్వహణకు రూ.8.50 కోట్లు ఖర్చు
కేవలం ఫాగింగ్‌కే రూ.10 లక్షల వ్యయం
అయినా పరిస్థితిలో కనిపించని మార్పు


