● పట్టణంలో పలు హాస్టళ్లు, వసతి
గృహాలను సందర్శించిన ఫుడ్ కమిషన్
● విద్యార్థులకు అందిస్తున్న
మెనూ పరిశీలన
కల్వకుర్తి: విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యతపై రాజీప్రస్తకే లేదని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్ర పుడ్ కమీషన్ సభ్యుడు గోవర్ధన్‌రెడ్డితో కలిసి ఆయన పట్టణంలోని పలు ప్రభుత్వ హాస్టళ్లు, వసతిగృహాలు, ప్రభుత్వాస్పత్రిలను పరిశీలించారు. హాస్టళ్లలో వంట గదులను, వండిన ఆహారాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే గుడ్డు పరిమాణం చాలా చిన్నదిగా ఉందని, వాటిని ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ ఇలాగే చేస్తున్నాడ నోట్‌బుక్‌లో నమోదు చేశారా అని అధికారులను ఆరా తీశారు. అనంతరం పట్టణంలోని సీహెచ్‌సీని పరిశీలించి గర్భిణులకు అందించే ఆహారం, డైట్ మెనూ పరిశీలించారు. ఇన్ పేషెంట్లు, బాలింతలకు అందించే పోషకాహారం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలింతలకు ఎన్‌హెచ్‌ఎం ఫండ్ కింద అందించే రూ.6 వేలు వచ్చే విధంగా సంబంధిత శాఖ అధికారులు చూడాలని ఆదేశించారు. అనంతరం పట్టణంలోని 99 వ సర్వేనంబర్‌లో ఉన్న సివిల్ సప్లయి గోదాం పరిశీలించి, స్టాక్ వివరాలు, రేషన్ దుకాణాలు, ఇతర ప్రభుత్వ అవసరాలకు అందించే బియ్యం వివరాలపై ఆరా తీశారు. వారి వెంట డీసీఎస్‌ఓ నర్సింహారావు, సివిల్ సప్లయి డీఎం రాజేందర్, కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ భీమానాయక్, కల్వకుర్తి తహసీల్దార్ ఇబ్రహీం, ఆస్పత్రి సూపరింటెండెంట్ శివరాం సిబ్బంది పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
వెల్దండ: విద్యార్థులకు నాణ్యమైన భోజనం సక్రమంగా అందించాలని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సభ్యులు గోవర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వెల్దండలోని రేషన్‌షాపు, కేజీబీవీ, గుండాల ఏకలవ్య రెసిడెన్షియల్, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే వారి ఆరోగ్యాలను కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు. రేషన్‌షాపులో లబ్ధిదారులకు బియ్యం సక్రమంగా అందించాలన్నారు. కేజీబీవీల్లో విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని, వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మంచి భోజనం అందించాలని సూచించారు. కూరగాయలు నాణ్యమైనవి తీసుకోవాలన్నారు. ఏకలవ్య పాఠశాలలో సరిపడా భోజనం అందించడం లేదని విద్యార్థులు వారి దృష్టికి తీసుకురాగా.. భోజనాన్ని పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిపడా భోజనం అందించాలని, నాణ్యమైన గుడ్లు పెట్టాలని చెప్పారు. వస్తువులను సక్రమంగా ఉంచుకోవాలన్నారు.
● వెల్దండ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని ప్రిన్సిపల్ విద్యార్థులపై అభ్యంతకరంగా మాట్లాడుతూ ఇబ్బందులకు గురి చేస్తుందని, విద్యార్థులను వివరించిన పట్టించుకోవడం లేదని ప్రిన్సిపల్‌ను తొలగించాలని ఫుడ్‌కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డికి విద్యార్థులు వివరించారు. ఇటీవల భోజనం సక్రమంగా లేకపోవడంతోనే రోడ్డుపైకి వచ్చిన ధర్నా నిర్వహించినట్లు వివరించారు. అంతకు ముందు మధ్యాహ్న భోజనం అధికారులు పరిశీలించారు. కల్వకుర్తి ఆర్డీఓ జనార్దన్‌రెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం రాజేందర్, డీటీ రాఘవేందర్‌రెడ్డి, తహసీల్దార్ కార్తీక్‌కుమార్, ఎంపీడీఓ సత్యపాల్‌రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ విద్యుల్లత పాల్గొన్నారు.


