లైంగికదాడి కేసులో డీఎస్పీ విచారణ | - | Sakshi
Sakshi News home page

లైంగికదాడి కేసులో డీఎస్పీ విచారణ

Mar 7 2026 9:21 AM | Updated on Mar 7 2026 9:21 AM

ఇద్దరు నిందితుల అరెస్టు, రిమాండ్‌

ఉప్పునుంతల: మండలంలో ఎస్టీ మైనర్‌ బాలికపై జరిగిన లైంగిక దాడికి సంబంధించిన కేసులో శుక్రవారం అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాసులు స్థానిక ఎస్‌ఐ వెంకట్‌రెడ్డితో కలిసి సదరు గ్రామంలో క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో నిందితులుగా ఉన్న గ్రామానికి చెందిన నానిగౌడ్‌, దుడ్డు రమేష్‌ను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. నిందితులను కల్వకుర్తి కోర్టులో హాజరు పర్చి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో

వ్యక్తి ఆత్మహత్య

అయిజ: ఆర్థిక ఇబ్బందులతో పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు.. మండలంలోని చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన బోయ సత్యం(43) శుక్రవారం తన నివాసంలో పురుగుల మందు తాగి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అప్పుల బాధతో తన భర్త మృతి చెందాడన్న భార్య నర్సమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

యువకుడి..

కొల్లాపూర్‌ రూరల్‌: మండలంలోని మాచినేనిపల్లి జీపీ పరిధిలోని మాధవరావుపేటకు చెందిన మాంద పురం నాగరాజు(25)అనే యువకుడు కొల్లాపూర్‌కు సమీపంలో సోమశిల ప్రధాన రహదారికి దగ్గరలో ఉన్న గుట్ట వద్ద వేపచెట్టుకు ఉరివేసుకొని అనుమానాస్పదంగా మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఎస్‌ఐ సురేశ్‌ కథనం ప్రకారం.. నాగరాజు గురువారం మాధవరావుపేట నుంచి తల్లి శేషమ్మకు మాచినేనిపల్లి వెళ్తున్నానని చెప్పాడు. శుక్రవారం ఉదయం కొల్లాపూర్‌కు సమీపంలో సోమశిల ప్రధాన రహదారి పక్కలో ఉన్న గుట్ట వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. నాగరాజు బైక్‌ కూడా అక్కడే ఉంది. గమనించిన ప్రయాణికులు కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. తల్లి శేషమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులు అప్పగించినట్లు పేర్కొన్నారు. నాగరాజు భార్య మౌనిక నాలుగు నెలల గర్భిణి కూడా ఈనెల 3న కొల్లాపూర్‌లో ఇంట్లోనే అనుమానాస్పదంగా మృతిచెందింది.

పెట్రోల్‌ పోసుకుని వ్యక్తి..

జడ్చర్ల: మానసిక వ్యథకు గురైన ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం బాదేపల్లిలో చోటుచేసుకుంది. సీఐ కమలాకర్‌ కథనం మేరకు.. బాదేపల్లి పాతబస్టాండ్‌ ప్రాంతంలో నివాసముంటున్న రాంచంద్రయ్య(35) తన శరీరంపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని కేకలు వేశాడు. చుట్టుపక్కల కుటుంబ సభ్యులు వెళ్లి మంటలు ఆర్పి 108అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. కొంతకాలం కిందట భార్య చనిపోవడం, కొడుకు దూరంగా అమ్మమ్మ వద్ద పెరగడంతో మానసికవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి తల్లి సత్యమ్మ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఉన్నత విద్యలో

సంస్కరణలకు త్వరలో శ్రీకారం

కల్వకుర్తి టౌన్‌: ఉన్నతవిద్యలో భారీ సంస్కరణలకు ప్రజాప్రభుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టబోతుందని ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ మహమూద్‌ సూచించారు. శుక్రవారం పట్టణంలోని మోడల్‌ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా చేపట్టే 99రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్య కోసం చేపడుతున్న కృషిని విద్యార్థులకు వివరించారు. ఉన్నత విద్యలో చేయాల్సిన సంస్కరణల గురించి అధ్యాపకులు, విద్యార్థుల నుంచి సలహాలు స్వీకరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ శార్వాణీ, వైస్‌ ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌ గౌడ్‌, అకాడమిక్‌ కోఆర్డినేటర్‌ బారోతురాజు, బోధన, బోధనేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement