గట్టు: సంపూర్ణత అభియాన్ 2.0పై క్షేత్రస్థాయిలో విషయాలను తెలుసుకునేందుకు కేంద్ర అధికారి చతుర్వేది శుక్రవారం మాచర్ల, బల్గెర, మిట్టదొడ్డి, చాగదోన, అంతంపల్లి, చిన్నోనిపల్లెలో పర్యటించారు. నీతిఆయోగ్ ద్వారా అమలవుతున్న ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాం అభివృద్ధి ఇండికేటర్ల పురోగతిని పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. విద్య, పౌష్టికాహారం, మరుగుదొడ్ల నిర్మాణం, విద్యార్థుల హాజరు, ఇతర అభివృద్ధి సూచికలను పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్న పౌష్టికాహారం, పిల్లల ఎత్తు, బరువు నమోదు, వృద్ధి పర్యవేక్ష అంశాలపై ఆరాతీశారు. చాగదోనలో ఆరోగ్య ఉపకేంద్రం, అంగన్‌వాడీ, జెడ్పీహెచ్‌ఎస్, మాచర్లలోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాల, అటల్ టంకరింగ్ ల్యాబ్‌ను పరిశీలించారు. విద్యార్థులు శాస్త్రసాంకేతికపై ఆసక్తిని పెంచుకుని, ఉన్నత లక్ష్యాలతో ముందుకుసాగాలని కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడి మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల మెరుగుదల, పోషకాహార పంపిణీ, విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టిని సారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, ఎంపీడీఓ చెన్నయ్య, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, అధికారులు పాల్గొన్నారు.


