అచ్చంపేట రూరల్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వేరుశనగ రైతులు అచ్చంపేటలో రోడ్డెక్కారు. ఇటీవలి కాలంలో అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌లో గరిష్టంగా క్వింటాల్‌కు రూ.13 వేలు పలికిన ధర ఒక్కసారిగా రూ.7 వేలకు పడిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.6 వేలు మాత్రమే ధర నిర్ణయించడంతో రైతులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇదేమిటని మార్కెట్ అధికారులను అడగగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా రైతులు మార్కెట్ నుంచి ర్యాలీగా అంబేడ్కర్ చౌరస్తాకు చేరుకొని అక్కడే బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మార్కెట్‌లోని పాలకపక్షం, వ్యాపారులు కుమ్మకై ్క రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యను మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకపోవడంతో రాస్తారోకోకు దిగామన్నారు. వ్యాపారుల కన్నుసన్నల్లోనే వ్యాపారం జరుగుతోందని, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనంతరం అక్కడికి పోలీసులు చేరుకుని మార్కెట్‌లో అధికారులతో మాట్లాడుదామని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. మార్కెట్‌లో అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ రైతులు ససేమిరా అన్నారు. తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్ద తు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.


