● ఘనంగా గరుడ,అశ్వ వాహన సేవ
● భక్తి పారవశ్యంతో పులకించిన భక్తులు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ అలివేలు మంగతాయారు రథోత్సవం (విమాన రథోత్సవం) బుధవారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవాల్లో శోభాయమానంగా అలంకరించిన గరుడ వాహనంపై వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగతాయారు ఉత్సవమూర్తుల విగ్రహాలను ఉంచి గరుడ సేవ నిర్వహించారు. గర్భగుడి నుంచి సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య ప్రధాన ద్వారం గుండా దేవస్థానం ఆవరణలోని రథం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం రథం ముందు కుంభం పోసి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత వివిధ రకాలపూలు, విద్యుత్ బల్బులు, మామిడి తోరణాలతో ముస్తాబు చేసిన రథంపై స్వామి దంపతులను ఉంచి రథోత్సవం నిర్వహించారు. భక్తుల హరినామస్మరణ మధ్య దేవస్థానం ముందున్న దేవగుండు వద్దకు రథాన్ని తీసుకెళ్లి మళ్లీ వెనక్కి తీసుకొచ్చారు. బంగారు ఆభరణాలు, కాగడాలు, విద్యుత్ బల్బుల కాంతుల్లో స్వామిదంపతులు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం గరుడ వాహనంపై దేవస్థానంలోని గర్భగుడి వద్దకు తీసుకొచ్చారు. ప్రత్యేక అభిషేకం, బలిహరణ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఘనంగా అశ్వవాహనసేవ...
అలివేలు మంగతాయారు దేవస్థానంలో బుధవా రం రాత్రి అమ్మవారి అశ్వవాహన సేవ నిర్వహించారు. అశ్వ వాహనంపై ఉత్సవ విగ్రహాలను ఊరే గించారు. విశేష దినోత్సవం సందర్భంగా గుట్టపైనున్న లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద భక్తుల రద్దీ కనిపించింది. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు అర్చకులు పాల్గొన్నారు.
నేడు వసంతోత్సవం..
ఉత్సవాల్లో భాగంగా గురువారం వసంతోత్సవం నిర్వహించనున్నారు. అలాగే పూర్ణాహుతి, అవబృతస్నానం, రాత్రికి నాగబలి (నాగవెల్లి), ద్వాదశారాధన, సప్తావరణాలు, మహాదాశ్వీరచనం కార్యక్రమాలు జరుగనున్నాయి. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి.
రథాన్ని లాగుతున్న భక్తులు
గరుడవాహనంపై ఊరేగుతున్న వేంకటేశ్వరస్వామి,
అలివేలుమంగతాయారు అమ్మవారు


