జల్సాలు, ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసై చోరీలు | - | Sakshi
Sakshi News home page

జల్సాలు, ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసై చోరీలు

Mar 5 2026 8:31 AM | Updated on Mar 5 2026 8:31 AM

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

4 తులాల బంగారం, బైక్‌ స్వాధీనం

వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వర్లు

జడ్చర్ల: జల్సాలు, ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీలకు పా ల్పడుతున్న అంతర్రాష్ట్ర చైన్‌ స్నాచర్స్‌ ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి మహబూబ్‌నగర్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు.. మంగళవారం జడ్చర్లలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా మోటార్‌బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారన్నారు. దీంతో నిందితులు వారు చేసిన దొంగతనాల గురించి ఒప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లోని అన్నమయ్య జిల్లాకు చెందిన పాత నేరస్తుడు రాసూరి హరికృష్ణ (26) ఆధ్వర్యంలో షేక్‌ ఇసాక్‌ (22), మూడే లక్ష్మణ్‌ (33) ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరు ముగ్గురు ఆన్‌లైన్‌ గేమ్స్‌ (లూడో, పేకాట)కు అలవాటు పడి భారీగా అప్పులు చేశారు. అప్పులు తీర్చడానికి ప్రత్యామ్నాయంగా దొంగతనాలకు పాల్పడ్డారు. ఫిబ్రవరి 27న బాదేపల్లి పట్టణంలోని బండమీది కిష్టారెడ్డినగర్‌లో ఓ కిరాణంలో వాటర్‌ బాటిల్‌ కొనుగోలు చేసేందుకు వచ్చి షాపులో ఒంటరిగా ఉన్న మహిళ మంజుల మెడలోని 2 తులాల పుస్తెల తాడును తెంపుకుని బైక్‌పై పారిపోయారు. ఫిబ్రవరి 25న ఇటిక్యాల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మో టార్‌బైక్‌ అపహరించారు. ఫిబ్రవరి 16న కర్నూల్‌లో బైక్‌ అపహరించి గోనెగండ్లలో మహిళ మెడలోని రెండు తులాల బంగారు చైన్‌ను లాక్కెళ్లారు. ఈ క్రమంలో నిందితుల నుంచి చోరీలకు ఉపయోగించిన మోటార్‌బైక్‌తో పాటు 4 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జడ్చర్ల కోర్టు లో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. తక్కువ సమయంలో దొంగలను పట్టుకున్న ఎస్‌ఐ మల్లేష్‌ ఆయన అభినందించారు. సమావేశంలో సీఐ కమలాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement