శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాలు
అమరచింత: మహాశివరాత్రికి శ్రీశైల మల్లికార్జునస్వామి, భ్రమరాంబికదేవిలకు అమరచింత పద్మశాలిలు పట్టువస్త్రాలను అందించే పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకు గాను శ్రీశైల క్షేత్రంలోని పద్మశాలి భవన్‌లో ప్రత్యేకంగా మగ్గం వేసుకుని నేత పనులను ప్రారంభించిన పద్మశాలీలు తాము కొలిచే దేవేర్లకు పట్టువస్త్రాలను సమర్పించేందుకు నేత పనులను చేపట్టారు. వారం రోజుల్లో వీటిని పూర్తిచేసి మహాశివరాత్రి రోజు ఆలయ ఈఓకు అప్పగించనున్నారు. కొన్ని వందల ఏళ్లుగా వస్తున్న ఆచారం ప్రకారం ప్రతి ఏటా వీటిని కొనసాగిస్తున్నట్లు పద్మశాలి సంఘం సభ్యులు తెలిపారు.
మల్లన్నకు కానుకగా..
శ్రీశైల మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కానుకగా పట్టువస్త్రాలను తయారు చేసి అందిస్తున్నారు. భక్త మార్కండేయస్వామి పద్మశాలిలకు కులదైవం కావడంతో ఆయన కొలిచే శివయ్యకు తమవంతు నైవేద్యరూపకంగా పట్టువస్త్రాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ఇక్కడే పట్టువస్త్రాలను తయారు చేసి శ్రీశైలం తీసుకెళ్లి అందించేవారమని ప్రస్తుతం శ్రీశైల క్షేత్రంలోని పద్మశాలి భవన్‌లో మగ్గం ఏర్పాటు చేసుకొని పట్టువస్త్రాలను అక్కడే తయారు చేస్తున్నట్లు చెప్పారు. పట్టణంలోని శివచౌడేశ్వరి ఆలయాన్ని నిర్మించిన మహంకాళి గంగ, శ్రీనివాసులు సోదరులు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పట్టువస్త్రాల తయారీకి అయ్యే ఖర్చులను భరిస్తున్నారు.
స్వామివారి సేవలో
అమరచింత
పద్మశాలీలు
మహాశివరాత్రి
నాటికి అందించేలా తయారీ పనులు
వందల ఏళ్లుగా
కొనసాగుతున్న
ఆచారం


