మహబూబ్‌నగర్
డూడూ.. బసవన్న
అయ్య వారికి.. అమ్మవారికి దండంపెట్టు
● గంగిరెద్దులతో సంక్రాంతికి కళ
● పండగకు ముందు నుంచే సందడి
● ఉమ్మడి జిల్లాలో వంద కుటుంబాలపైగా గంగిరెద్దులోళ్లు
ఉమ్మడి జిల్లాలోపండుగ శోభ
● రంగవల్లులతో సప్తవర్ణశోభితంగా వాకిళ్లు
● బంధుమిత్రులతో కళకళలాడుతున్న పల్లెలు
● ఘనంగా భోగి వేడుకలు
గురువారం శ్రీ 15 శ్రీ జనవరి శ్రీ 2026
డూడూ బసవన్న అనగానే సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దు గుర్తుకు వస్తుంది. పండగ భోగి మొదలు కనుమ వరకు మూడు రోజుల పాటు గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ యాచిస్తూ గంగిరెద్దుల వాళ్లు చేసే విన్యాసాలు అలరిస్తుంటాయి. రెండు మూడు దశాబ్దాల కిందటి వరకు నాలుగైదు ఊర్లలో మూడు నాలుగు వందల కుటుంబాలు ఉండే గంగిరెద్దుల వాళ్లు ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 105 కుటుంబాలు మాత్రమే మిగిలాయి. గంగిరెద్దులను ఆడించే వారు యాదవ కులంకు చెందిన వారే అయినప్పటికీ వారితో సంబంధాలు అంతంత మాత్రమే. వీరిది అంతా సంచార జీవనమే. యాచక వృత్తి ప్రధానంగా జీవిస్తుంటారు. పండగలు, పర్వదినాలతో పాటు ఎవరైనా మరణిస్తే అక్కడ ప్రత్యక్షం అవుతుంటారు. ముఖ్యంగా పంటలు చేతికి వచ్చే సమయానికి గంగిరెద్దులతో వీరు ప్రత్యక్షం అవుతుంటారు. అప్పటి వరకు ఊరూరా సంచరిస్తూ జీవనం గడుపుతుంటారు.
గంగిరెద్దు అలంకరణ
ఎద్దుకు వారు చెప్పినట్లుగా ఆడేలా శిక్షణ ఇచ్చి అలంకరిస్తారు. మూపురం నుంచి తోక వరకు ఎంతో అందంగా రంగు రంగులతో కుట్టిన బొంతలు, పాత పట్టు చీరలను అలంకరిస్తారు. కొమ్ములను రింగులతో అందంగా తీర్చిదిద్ది వాటికి గొట్టాలను ధరింపజేసి రంగురంగుల ఊలు ధారాలను కడతారు. వీటిని కుప్పెలుగా పిలుచుకుంటారు. నొసటిభాగంలో తోలుతో అలంకరించి పైన గవ్వలు వేలాడదీస్తారు. కాళ్లకు గజ్జెలు కట్టి ఆడిస్తుంటారు.
సన్నాయి, బూర
గంగిరెద్దును ఆడించే వారి వేషాధారణ సైతం ప్రత్యేకంగానే ఉంటుంది. వారి చేతిలో సన్నాయి, బూర, చిన్న గంట పట్టుకుంటారు. ఎవరైనా పాతకోటు ఇస్తే అది వేసుకుని తిరుగుతుంటారు. ఏకాలనీలోకి అడుగుపెట్టినా సరే సన్నాయి బూర శబ్దం వచ్చిందంటే గంగిరెద్దులోళ్లు వచ్చారని అట్టే అర్థం అవుతుంది.
ఆదరణ తగ్గింది
మా గ్రామం చర్లపల్లి అయినా పెద్దలనుంచి వచ్చిన గంగిరెద్దులను ఆడించటం కోసం సంచార జీవనం గడుపుతున్నా. భార్య ఇద్దరు పిల్లలతో గంగాపూర్‌లో గుడారాలు వేసుకొని జీవిస్తున్నాను. నా చిన్నతనం నుంచి ఇదే వృత్తిలో ఊరూరా తిరుగుతుంటాను. ఏడాదిలో ఈ మూడు రోజులే జడ్చర్లలో తిరిగి యాచకం చేస్తా. ఇంతకుముందు అయితే ధనం, ధాన్యం, గడ్డి అన్ని దానం చేసేవారు. ఇప్పుడు పూర్తిగా ఆదరణ తగ్గిపోయింది.
– రాములు, గంగిరెద్దులను ఆడించే వ్యక్తి
ఎద్దులే సాకుతాయి..
ఎద్దులను మంచిగా చూసుకుంటే అవి మా కుటుంబాలను సాకుతున్నాయి. వాటినే నమ్ముకుని ఏళ్ల తరబడి బతుకుతున్నాం. ఎద్దులు మంచిగా ఉంటేనే మా కుటుంబాలు చల్లగా ఉంటాయి. మారుతున్న సమాజంతో పొటీ పడేలా మాకు ప్రత్యేకమైన సదుపాయలు కల్పిస్తే మానుగడ సాగిస్తాం. తాతల నుంచి వస్తున్న ఆచారాన్ని కొనసాగించేలా నెట్టుకొస్తున్నాం. – రాములు, నవాబుపేట
●
మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్


