బీసీలకు 26, మహిళలకు 30 డివిజన్లు
● మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో రిజర్వేషన్లు ఖరారు
● మూడు మున్సిపాలిటీల్లోనూ రిజర్వేషన్ల ప్రకటన
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఎట్టకేలకు మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లు, మూడు మున్సిపాలిటీల్లోని వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. పాలమూరులో మొత్తం 60 డివిజన్లు ఉండగా.. అందులో జనరల్ (అన్ రిజర్వ్‌డ్)కు 14, జనరల్ మహిళలకు 16 కేటాయించారు. ఇక బీసీలకు 26, ఎస్సీలకు 3, ఎస్టీలకు 1 రిజర్వు చేశారు. ఇందులో బీసీల కేటగిరీకి కేటాయించిన 26 డివిజన్లలో పురుషులు, మహిళలకు సమానంగా 13 చొప్పున రిజర్వ్ చేశారు. ఎస్సీలలో పురుషులకు 2, మహిళలకు 1, ఎస్టీలలో ఉన్న ఒక్కటి పురుషులకే వెళ్లింది. ఇవన్నీ 2011 జనాభా లెక్కల ప్రకారమే ఆయా కేటగిరీల వారీగా విభజించామని అందులో పేర్కొన్నారు. అలాగే బీసీలకు సంబంధించి తాజాగా డెడికేటెడ్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్నారు. మొత్తానికి మహిళలకు జనరల్, బీసీ, ఎస్సీ కేటగిరిలో 30 డివిజన్లు కేటాయించడం విశేషం. ఇక ఏ డివిజన్ ఏ కేటగిరీకి రిజర్వు చేస్తారో త్వరలోనే కలెక్టర్ విజయేందిర ఆధ్వర్యంలో నిర్ణయించనున్నారు.
3 మున్సిపాలిటీలలో రిజర్వేషన్లు ఇలా..
● భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. ఇందులో జనరల్‌కు 2, జనరల్ మహిళలకు 3, బీసీలకు 2 (పురుషులు, మహిళలకు ఒక్కొక్కటి), ఎస్సీలు 1 (పురుషులకు), ఎస్టీలు 2 (పురుషులు, మహిళలకు ఒక్కొక్కటి) చొప్పున కేటాయించారు.
● దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఇందులో జనరల్‌కు 2, జనరల్ మహిళలకు 4, బీసీలకు 3 (పురుషులు 2, మహిళలు 1), ఎస్సీలు 2 (పురుషులు, మహిళలకు ఒక్కొక్కటి), ఎస్టీలు 1 (పురుషులు) రిజర్వు చేశారు.
● జడ్చర్ల మున్సిపాలిటీకి పాలకవర్గం గడువు ఈ ఏడాది మే వరకు ఉన్నప్పటికీ తాజాగా రిజర్వేషన్లు ఖారారు చేశారు. మొత్తం 27 వార్డులుండగా.. ఇందులో జనరల్‌కు7, జనరల్ మహిళలకు 7, బీసీలకు 9 (పురుషులు 5, మహిళలు 4), ఎస్సీలకు 3 (పురుషులు 2, మహిళలు 1), ఎస్టీలు 1 (పురుషులకు) కేటాయించారు.


