మురిపించే.. ముగ్గుల హారం
చుక్కలు.. గీతలు.. మెలికలు.. వెరసి అందమైన ముగ్గులు. ఈ ముగ్గులు మహిళల సృజనాత్మక శక్తికి ప్రతీకలుగా నిలుస్తాయి. వీటిని వేయడం వల్ల ఇంటికే కొత్త అందం వస్తుంది. సాధారణంగా ముగ్గు లేని వాకిలి కనిపించదు. ఇంటి ముందు కళ్లాపి చల్లి ముగ్గులు వేయడమంటే ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించటమేనని పెద్దలు చెబుతారు. సాధారణం ముగ్గులు అనగానే సంక్రాంతి పండుగనే గుర్తుకు వస్తుంది. సంక్రాంతి లక్ష్మీని ఆహ్వానించే చక్కటి ప్రక్రియ ఈ ముగ్గులు. సంక్రాంతి పండుగకు కొద్ది రోజుల ముందునుంచే ముగ్గుల సందడి మొదలవుతుంది. మహిళల మునివేళ్ల స్పర్శతో ముగ్గు ఎన్నో రూపాలను సంతరించుకొని అందమైన ఆకారాల్లో ఒదిగిపోయి లోగిళ్లకు కొత్త అందాలను అద్దుతాయి. అలాంటి ముగ్గుల్లోనూ రకాలు ఉన్నాయి. మెలికలు తిరుగుతై మధ్యమధ్యలో చుక్కలు ఉండేవి ముత్యాల ముగ్గులని, సరిసంఖ్యలో ఉన్న చతుర్భుజాలు, అష్ట భుజాలు, త్రికోణాలు వచ్చేవి రత్నాల ముగ్గులని చెబుతారు. బియ్యం పిండితో, ముగ్గు పిండితో ముగ్గులు వేసి వాటి మధ్యలో లక్ష్మీదేవికి ప్రతి రూపమైన గొబ్బెమ్మలు ఉంచుతారు. ఆవుపేడతో చేసిన ఈ గొబ్బెమ్మలపై గుమ్మడి, బీర పూలు ఉంచి, కొత్తగా పండిన నవధాన్యాలు, పళ్లు, ఆకులతో అలంకరిస్తారు. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి కొందరు మహిళలు మెసేజ్ ఇచ్చే తరహాలో ముగ్గులు వేస్తున్నారు. కాగా.. సంక్రాంతి వేళ పలు సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ముగ్గుల పోటీలు నిర్వహించి, గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేస్తున్నారు.


