చిన్నారిపై వీధికుక్క దాడి
అడ్డాకుల: పొన్నకల్‌లో ఓ చిన్నారిపై వీధికుక్క దాడిచేసి తీవ్రంగా గాయపర్చింది. గ్రామానికి చెందిన మన్నెంకొండ, విజయలక్ష్మి దంపతుల కుమార్తె అనూష మంగళవారం సాయంత్రం ఇంటి పరిసరాల్లో ఆడుకుంటోంది. ఈ క్రమంలో సమీపంలో ఉన్న ఓ షాపు వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఓ వీధి కుక్క చిన్నారిపై దాడి చేసింది. చుట్టుపక్కల వారు కుక్కను తరిమేందుకు ప్రయత్నించినా.. కుక్క చిన్నారిపై చాలాసేపు దాడి చేసింది. చివరికి అందరు కలిసి కుక్కను తరుమడంతో చిన్నారిని వదిలి పారి పోయింది. ఈ ఘటనలో చిన్నారి ముఖంపై దవడ భాగంలో రంధ్రం ఏర్పడింది. స్థానికు లు వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉందని, అధికారులు స్పందించి కుక్కలను నివారణకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీ
మానవపాడు: జాతీయ రహదారి 44పై జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న బస్సును వెనుక నుంచి డీసీఎం ఢీకొట్టిన ఘటన మానవపాడు శివారులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. హైదారాబాద్ నుంచి బెంగుళూరు వైపు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ ఐరావత్ ట్రావెల్స్ బస్సును వెనుక వైపు నుంచి డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ సమయంలో బస్సులో దాదాపు 31మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. బస్సు డ్రైవర్ శరణయ్య చాకచాక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనలో డీసీఎం డ్రైవర్ ప్రవీణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ నియంత్రించారు.


