పొలానికి వెళ్తుండగా రైతు మృతి
● బైక్ అదుపు తప్పడంతో ప్రమాదం
బిజినేపల్లి: మండలంలోని ఎర్రకుంటతండా గ్రామ పంచాయతీలోని జకునతండాకు చెందిన రైతు హన్మంత్‌నాయక్ (55) పొలానికి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడడంతో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. హన్మంత్‌నాయక్ మంగళవారం ఉదయం కేఎల్‌ఐ పిల్ల కాల్వ మీదుగా ద్విచక్ర వాహనంపై పొలానికి వెళ్తున్నాడు. కాల్వపై గుంతలు ఎక్కువగా ఉండటంతో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కకు పడిపోయాడు. అటుగా వెళ్తున్న కొందరు విషయం గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు గుర్తించారు. హన్మంత్‌నాయక్‌కు భార్య సాలీ, నలుగురు సంతానం ఉన్నారు.
పురుగు మందు తాగి.. వ్యక్తి మృతి
మాగనూర్: మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన రవి (41) చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. గ్రామానికి చెందిన కావలి రవి– సుజాత దంపతులు తరచూ గొడవపడుతూ ఉండేవారు. ఈనెల 11న కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో రవి క్షణికావేశంతో పురుగులమందు తాగాడు. కుమారుడు వంశీ ఇంటికి వచ్చే సరికే స్పహ కోల్పోయి ఉన్నాడు. వెంటనే మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించాడు. దీంతో భార్య మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అశోక్‌బాబు తెలిపారు.
భార్య కాపురానికి రాలేదని గొంతు కోసుకున్న భర్త
గద్వాల క్రైం: భార్య కాపురానికి రాలేదని మనస్థాపం చెందిన భర్త గొంతు కోసుకున్న ఘటన మంగళవారం గద్వాల పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ రెండో ఎస్‌ఐ సతీష్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని వడ్డెవీధికి చెందిన రాధమ్మకు రాయిచూర్‌కు చెందిన రాజుతో ఐదేళ్ల క్రితం పైళ్లెంది. అయితే వివాహం అయినప్పటి నుంచి రాజు భార్యను వేధిస్తుండడంతో మనస్థాపం చెందిన ఆమె కొన్ని నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో భార్యను తనతో పాటు రాయిచూర్‌కు పంపించాలని రాజు అత్తగారింటి వారితో వాగ్వాదానికి దిగాడు. ఆమె వెళ్లేందుకు నిరాకరించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రాజు క్షణికావేశంలో బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యామత్నం చేశాడు. రక్తస్రావం కావడంతో గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు శస్త్ర చికిత్స చేసి గొంతుకు కుట్లు వేశారు. బలమైన గాయం కాలేదని నరాలపై ప్రభావం పడిందని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇది ఇలా ఉండగా ఆరు నెలల క్రితమే భర్త వేధింపులు తాళలేక భార్య రాధమ్మ పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరికీ సఖీ సెంటర్‌లో కౌన్సెలింగ్ సైతం అందించామని ఎస్‌ఐ తెలిపారు.
చెరువులో దూకి వృద్ధురాలి బలవన్మరణం
తిమ్మాజిపేట: మండలంలోని గొరిటకు చెందిన వృద్ధురాలు దాసరి అక్కమ్మ (70) చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ హారిప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాలు.. అక్కమ్మ తన ఒక్కగానొక్క కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించింది. దీంతో వృద్ధాప్యంలో తన పనులు కూడా తాను చేసుకోలేని స్థితికి చేరుకోవడంతో తీవ్ర మసస్తాపానికి గురై గ్రామ సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం మృతదేహం నీటిపై తేలడంతో గుర్తించిన స్థానికులు కుమార్తెకు సమాచారం అందించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వితంతు మహిళ
ఆత్మహత్య
వీపనగండ్ల: అత్తగారి గ్రామంలో ఉన్న ఇంటి స్థలాన్ని విక్రయించేందుకు అత్త అడ్డుచెప్పడంతో మనస్థాపానికి గురైన వితంతువు వడ్డె శిల్ప (28) వాజ్మాయిల్ తాగి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. బొల్లారం గ్రామానికి చెందిన శిల్పకు పెంట్లవెల్లి గ్రామానికి చెందిన శివతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. రెండేళ్ల క్రితం భర్త చనిపోవడంతో శిల్ప బొల్లారంలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో పెంట్లవెల్లిలో ఉన్న ఇంటి స్థలాన్ని విక్రయించాలని ప్రయత్నించగా.. అత్త అడ్డుకోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి కుమారుడు ఉన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.


