పండుగ వేళ విషాదం
భూత్పూర్: సంక్రాంతి పండగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకొందామని గ్రామానికి వెళ్తుండగా.. ప్రమాదం రూపంలో ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. కళ్లముందే భార్య దుర్మరణం చెందగా.. మూడేళ్ల కూతురు చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రితోపాటు మరో కూతురు గాయాలతో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం భూత్పూర్ వద్ద బ్రిడ్జిపై కారు ప్రమాదంలో సంక్రాంతి పండగకని కూతురు వద్దకు తిరుపతి వెళ్తుండగా భార్యాభర్తలు మృతిచెందిన ఘటన మరువక ముందే మరో ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన వాహనదారులను కలిచివేసింది. వివరాలిలా..
ఏపీలోని నంద్యాల జిల్లా పగిడియాల మండలం మచ్చుమర్రికి చెందిన సూర్య తిరుపతయ్య, భార్య భాగమణి (25) చిన్న కూతరు యస్న(3), మరో కూతరు ప్రియాంచితో కలిసి హైదారాబాద్‌లోని అల్వాల్‌లో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి పండగకని స్వగ్రామానికి బైక్‌పై మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో భూత్పూర్ మండలం అన్నాసాగర్ సమీపంలోని గాజులపేట స్టేజీ జాతీయ రహదారిపై మోటర్ సైకిల్ అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న రేలింగ్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో భార్య నాగమణి (25) అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. చిన్నకూతురు యస్న (3) జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. తిరుపతయ్యతోపాటు మరో కూతురు ప్రియాంచి గాయాలతో చికిత్స పొందుతున్నారు. నాగమణి తల్లి ఉస్సేనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు.
రెండ్రోజుల్లో రెండో ప్రమాదం
భూత్పూర్ వద్ద జాతీయ రహదారిపై బ్రిడి వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఏపీ వాసులు భార్యాభర్తలు మృతిచెందారు. పండగవేళ తిరుపతిలోని కూతురు వద్దకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
రోడ్డు ప్రమాదంలో భార్య, కూతురు మృతి
భర్త, మరో కూతురుకి తీవ్ర గాయాలు
రెండ్రోజుల్లో రెండో ప్రమాదం, నలుగురి మృతి


