ఉత్కంఠ పోరులో మహబూబ్‌నగర్ విజయం
● 13 పరుగుల తేడాతో నిజామాబాద్‌పై గెలుపు
● అర్ధసెంచరీతో రాణించిన అబ్దుల్ రాఫే
మహబూబ్‌నగర్ క్రీడలు: కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ జిల్లాల టీ–20 లీగ్‌లో భాగంగా రెండో దశ పోటీల్లో భాగంగా స్థానిక ఎండీసీఏ మైదానంలో నిర్వహిస్తున్న లీగ్ మ్యాచ్‌లు మంగళవారం ముగిశాయి. చివరి వరకు ఉత్కంఠగా సాధిన నిజామాబాద్– మహబూబ్‌నగర్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్ అబ్దుల్ రాఫే బిన్ అబ్దుల్లా (42 బంతుల్లో 8 ఫోర్లతో 55 పరుగులు) మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆకాష్ వెంకట్ (37 నాటౌట్), డేవిడ్‌క్రిపాల్ రాయ్ (33), శ్రీకాంత్ నాయక్ (30) రాణించారు. నిజామాబాద్ బౌలర్ లలిత్‌రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నిజామాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. హర్షవర్దన్ (57) అర్ధసెంచరీ చేయగా.. అజిత్(31), విక్రంయాదవ్ (21), సాయిప్రతీక్ (20) రాణించారు. పాలమూరు బౌలర్లు ముఖితుద్దీన్, తేజావత్ హరీశ్, రాకేష్‌నాయక్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అబ్దుల్ రాఫె బిన్ అబ్దుల్లా (మహబూబ్‌నగర్) నిలిచాడు.
● మరో మ్యాచ్‌లో నిజామాబాద్ 56 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. విక్రం యాదవ్ 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 ఫోర్లతో 84 పరుగులు నాటౌట్, ఎం.సాయిప్రతీక్ 49 పరుగులు, వైవీరెడ్డి 34 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. జట్టులో తక్‌షిల్ (56) అర్ధ సెంచరీ చేయగా... ఎం.సాయిప్రతీక్, లలిత్‌రెడ్డి మూడేసి వికెట్లు తీశారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన సాయిప్రతీక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.


