ఉమామహేశ్వరుడికి శ్రీశైలం నుంచి పట్టువస్త్రాలు
అచ్చంపేట రూరల్: శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవానికి భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున ఆలయానికి ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర ఆలయంలో ఈనెల 15నుంచి 22వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలికి చేసిన విజ్ఞప్తి మేరకు ఈనెల 16న ఉమామహేశ్వరంలో నిర్వహించే పార్వతీపరమేశ్వరుల దివ్య కల్యాణ మహోత్సవానికి శ్రీశైల దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలను అందజేయాలని నిర్ణయించింది. ఇలా పట్టు వస్త్రాలు అందజేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా మంగళవారం శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు సుధాకర్‌రెడ్డి ఉమామహేశ్వర ఆలయాన్ని సందర్శించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి, కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావుతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం వారు ఉమామహేశ్వర ఆలయ బ్రహోత్సవాల సందర్భంగా జరిగే పార్వతీ పరమేశ్వరుల కల్యాణానికి జారీచేసిన ఆర్డర్ కాపీని ఆలయ చైర్మన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కట్ట సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమామహేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి భవిష్యత్‌లో శ్రీశైల దేవస్థానం నుంచి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం సుధాకర్‌రెడ్డిని ఆలయం తరఫున ఘనంగా సన్మానించారు.


