సిరిసంపదలు పొంగాలంటూ..
రైతులు ఆరుగాలం శ్రమించగా చేతికి వచ్చిన పంటలతో సంతోషంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. మూడు రోజుల పండగలో రెండవరోజు సంక్రాంతి. పాలు పొంగించి పొంగళి అనే తీపిపదార్థం తయారు చేస్తారు. వచ్చే ఏడాది పాటు తమ ఇళ్లల్లో సిరి సంపదలు పాలు పొంగినట్లుగా పొంగాలని కోరుకుంటూ ఇళ్లల్లో పాలు పొంగించటం ఆనవాయితీగా వస్తోంది. రెండు కొత్త కుండలు (గురిగి) తీసుకువచ్చి వాటిని అలంకరించి పాలు పోసి బెల్లం వేస్తారు. ఆవు పిడకలు, నెయ్యితో మంట వేసి ఆ పాలు పొంగేవరకు మంటపెడతారు. పాలు ఈశాన్యం వైపు పొంగితే ఆ ఇంట సిరిసంపదలకు తావుండదని విశ్వాసం. ఇంటిముందు రంగవళ్లులు తీర్చిదిద్దటం వల్ల లోగిళ్లన్ని ఇంద్రధనుస్సును తలపిస్తూ కొత్త కాంతిని ప్రసరింపజేస్తాయి. కొన్ని ప్రాంతాల్లో పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. మూడో రోజు కనుమపండగ సందర్భంగా పశువులను అలంకరించి వాటికి పూజలు చేసి విందు, వినోదాలతో గడుపుతారు.


