రేగుపళ్లతో బోడాలు
విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వటంతో ఇప్పటికే పిల్లలు ఇళ్లకు చేరుకున్నారు. కొత్తగా వివాహాలు అయిన వారిళ్లలో ఆడపడుచులతో పాటు అల్లుళ్లు రావడంతో కొత్త ఉత్సాహం నెలకొంది. బుధవారం భోగి పురస్కరించుకుని చిన్నారులకు రేగుపళ్లతో దిష్టి తీయటం చేస్తుంటారు. మూడు నెలల చిన్నారినుంచి ఐదేళ్ల బాలబాలికలకు చీడపీడలు దరిచేరకుండా ఉండాలని కోరుకుంటూ రేగుపళ్లు, నూగులు, బియ్యంతో దిష్టి తీస్తుంటారు. ఎలాంటి రుగ్మతలు దరి చేరకుండా ఉండాలని మూడుసార్లు రేగుపళ్లను తలపై పోస్తారు. దీనిని భోగిపళ్లు, బోడాలుగా పిలుచుకుంటారు. రేగుపళ్లతో పాటు ఇటీవల కాలంలో పూలను వాడుతున్నారు. ఈ వేడుకలో భాగంగా పేరంటాలకు పసుపు, కుంకుమలు, చందనం అందించి, శనగలు, పటికబెల్లం, నువ్వులు, బెల్లం కలిపి దంచిన చిమ్మిలి ఉండలు ఇస్తారు. ఈ అన్ని కార్యాల వల్ల గ్రహ శాంతి కూడా కలుగుతుందని విశ్వసిస్తారు. జడ్చర్లలో మంగళవారం సాయంత్రమే కొందరు బోడాల వేడుక నిర్వహించారు.


