పాలమూరుకు తీరని ద్రోహం చేసిన బీఆర్‌ఎస్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో మహబూబ్‌నగర్‌ను అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లకే దక్కుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. పాలమూరు పేరును పదేపదే వందలసార్లు నోట్లో నానబెట్టి, చివరకు ఆ పేరునే ముంచేశారని మండిపడ్డారు. ఇది నిర్లక్ష్యం కాదు.. అనుకోని తప్పు కాదు.. పూర్తి తెలిసే చేసిన తీరని ద్రోహం.. నిన్న మహబూబ్‌నగర్‌లో జరిగిన కేటీఆర్ మీటింగ్ అభివృద్ధిపై చర్చించేందుకు కాదు.. పాలమూరు ప్రజల జ్ఞాపకశక్తిని తక్కువ చేసి మాట్లాడేందుకు, వారి సహనాన్ని పరీక్షించేందుకు జరిగిన సభ..’ అని విమర్శించారు. జూరాల పై నుంచి వచ్చే వరద నీటిని తన కాలు అడ్డం పెట్టి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్న కేసీఆర్.. చివరకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను శ్రీశైలానికి ఎలా తరలించారని ప్రశ్నించారు. జూరాల నీటిని ఒడిసి పట్టుకునే చిత్తశుద్ధి బీఆర్‌ఎస్ నాయకులకు లేకపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకాలకు అనుమతులు మంజూరు చేసి రైతులపై సీఎం రేవంత్‌రెడ్డికి ఉన్న మమకారాన్ని చూపించారన్నారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. వచ్చే మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండేళ్లలో సుమారు రూ.రెండు వేల కోట్లతో నగర అభివృద్ధికి సీఎం చేయూతనిచ్చారన్నారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు మారేపల్లి సురేందర్‌రెడ్డి, సీజేబెన్‌హర్, సిరాజ్‌ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.


