దశ మారనున్న ‘దేవరకద్ర’
● నేడు ఇద్దరు మంత్రుల రాక
● రూ.18 కోట్ల పనులకు శంకుస్థాపన
దేవరకద్ర: దేవరకద్ర మున్సిపాలిటీగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా మంజూరైన నిధులతో వివిధ అభివృద్ధి పనులకు బుధ వారం మంత్రుల కోమిటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం పూర్తి ఏర్పాట్లు చేశారు. కొత్త మున్సిపాలీటీ కింద రూ.15కోట్లు మంజూరు కాగా, మున్సిపాలిటీ భవన నిర్మాణానికి మరో రూ.5కోట్లు మంజూరయ్యాయి. అలాగే మూడా కింద మరో రూ.3కోట్లు గతంలోనే మంజూరుకాగా.. వచ్చిన నిధులతో చేపట్టే పనుల వల్ల దేవరకద్ర దశ మారనుంది. దేవరకద్ర ఆర్వోబీకి రెండువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే రాఘవేంద్ర టాకీస్ నుంచి సర్వీసు రోడ్డు సీసీ పనులు పూర్తికాగా దీనిని ప్రారంభోత్సవం చేస్తారు. అలాగే ఆర్వోబీ పిల్లర్లకు మధ్యన గోడలు నిర్మించి చెట్లను పెంచడం గ్రీనరీగా మార్చడం, చిన్న వ్యాపారులకు షాపుల నిర్మాణం, యూటర్న్ రోడ్లు, సుందరీకరణ పనులు చేపట్టడానికి నిధులను కేటాయించారు.
అడిగిన రెండు రోజుల్లోనే రూ.5కోట్లు
దేవరకద్రలోని ఆర్‌అండ్‌బీకి సంబంధించి శిథిలలైన గెస్టుహౌస్ స్థానంలో మున్సిపల్ కార్యాలయం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి అడిగిన రెండు రోజుల్లోనే రూ.5కోట్లు మంజూరు చేసి ప్రొసీడింగ్ ఇచ్చారని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తెలిపారు. దేవరకద్ర మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నామని తెలిపారు. దేవరకద్ర నుంచి మార్కెట్ రోడ్డు బల్సుపల్లి, గోప్లాపూర్, మీనుగోనిపల్లి, చౌదర్‌పల్లి రోడ్లకు డివైడర్‌లు పెట్టించి చెట్లను పెంచే పనులు త్వరలో చేపడతామని తెలిపారు.


