బ్రహ్మోత్సవాలకు వేళాయే..
● 14నుంచి 22 వరకు ఉమామహేశ్వరుడి ఉత్సవాలు
● ఏర్పాట్ల పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యులు
అచ్చంపేట: శ్రీశైలం ఉత్తరద్వారంగా బాసిల్లుతున్న ఉమామహేశ్వర క్షేత్రం ఉత్సవాలకు వేళైంది. ఉత్సవాల నిర్వహణకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. అచ్చంపేట మండలం రంగాపూర్ పంచాయతీ పరిధిలో నల్లమల కొండలపై వెలిసిన ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రతిఏటా మకర సంక్రాంతి సందర్భంగా ఉత్తరాయణంలో ఈనెల 14న మొదలై 22 వరకు వారంపాటు కొనసాగుతాయి. ఉమామహేశ్వర స్వామివారి దర్శనానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.
నిత్యాన్నదానం
పర్యాటకశాఖ ఆధ్వర్యంలో కొండ దిగువన భోగమహేశ్వరంలో హరిత గదులు, ఆహ్లాదకరమైన ఉద్యాన వనం ఏర్పాటు చేశారు. కొండ కింద కోనేరు నుంచి ప్రధాన ఆలయం వరకు 600 మెట్లు, విశ్రాంతి గది, పాపనాశం వద్ద ప్రత్యేక స్నానపు గదులు, డ్రెస్సింగ్ రూములు నిర్మించారు. ఆలయం నుంచి నాగుల వరకు ప్రాంగణాన్ని విస్తరించారు. క్షేత్రంలో నాలుగేళ్లుగా నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఇక్కడికి వచ్చే భక్తులు, పర్యాటకులకు 600నుంచి 1000 మందికి ఆకలి తీర్చుతున్నారు. దాతలు, భక్తులు ఇచ్చే విరాళాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భోజన వసతి పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
భోగమహేశ్వరం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
ఉమామహేశ్వరం కింది కొండ భోగమహేశ్వరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. దాతల సహకారంతో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ఉమామహేశ్వర క్షేత్రంలో సౌకర్యాలు కల్పించేందుకు స్థల సమస్య ఉండడంతో కింద ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే కొండపైకి రెండు బసులు ఏర్పాటు చేశాం. పార్కింగ్ సమస్య లేకుండా చూస్తున్నాం. రాాబోవు రోజుల్లో అన్నదాన కేంద్రం కూడా కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రోడ్డుమార్గంలో విద్యుద్దీపాలు, హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేశాం.
– బీరం మాధవరెడ్డి, ఆయల కమిటీ చైర్మన్
స్వామివారి బ్రహ్మోత్సవాలు
14న బుధవారం సాయంత్రం 4గంటలకు అయ్యప్పస్వామి పూజ, సాయంత్రం 6గంటలకు మకర జ్యోతి దర్శనం అనంతరం మంగళహారతి ఉంటుంది. 15న గురువారం సాయంత్రం 7గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణం, అగ్నిప్రతిష్టాపన, బలిహరణం, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. రాత్రి 8గంటలకు అచ్చంపేట భ్రమరాంబ ఆలయం, వివిధ గ్రామాల నుంచి అలంకరణాలతో ఏర్పాటు చేసిన ప్రభలు ఉమా మహేశ్వరానికి వస్తాయి. రాత్రి 2గంటలకు స్వామివారు ఉమామహేశ్వరం కొండపై నుంచి మంగళవాయిధ్యాలతో పల్లకీసేవతో కిందకు వస్తారు. అచ్చంపేట నుంచి ప్రభత్సోవం భోగమహేశ్వరం చేరుకోగానే 16న శుక్రవారం తెల్లవారుజామున 4గంటలకు పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవం దిగువ భోగమహేశ్వరంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి. అదేరోజు రాత్రి 7గంటలకు పల్లకీసేవ ఉంటుంది. 17న శనివారం రాత్రి 7గంటలకు అశ్వవాహనసేవ, 18న ఆదివారం రాత్రి 7గంటలకు నంది వాహనసేవ ఉంటుంది. 19న సోమవారం శేషవాహన సేవ ఉంటుంది. 16నుంచి 22వరకు ఉత్తరాయణ పుణ్యకాల స్నానములు, ప్రత్యేక పూజలు జరుగుతాయి.
బ్రహ్మోత్సవాలకు వేళాయే..
బ్రహ్మోత్సవాలకు వేళాయే..


