వివాహిత బలవన్మరణం
బిజినేపల్లి: మండలంలోని అల్లీపూర్‌కు చెందిన వివాహిత శివలీల (33) సోమవారం మండల కేంద్రంలోని తన పుట్టింట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. శివలీల కొద్దిరోజుల కిందట అల్లీపూర్ నుంచి వచ్చి పుట్టింట్లోనే ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కాసేపటికి కుటుంబ సభ్యులు వచ్చి చూడగా ఉరేసుకొని మృతిచెంది కనిపించింది. సంతానం లేదని మానసికంగా బాధపడుతుండేదని గ్రామస్తులు తెలిపారు.
యువతి బలవన్మరణం
గద్వాల క్రైం: మండలంలోని సంగాలకు చెందిన బొల్లెద్దుల పవిత్ర (20) ఆదివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. గ్రామానికి చెందిన పవిత్ర, అదే గ్రామానికి చెందిన లక్ష్మన్న ఏడాదిగా ప్రేమించుకున్నారు. వివాహం చేసుకునేందుకు యువకుడు నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. సోమవారం ఉదయం గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సోదరుడు చరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
వాగులోపడి వ్యక్తి మృతి
కేటీదొడ్డి: మండలంలోని నందిన్నె–కుచినెర్ల రహదారిలో ఉన్న వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు.. కర్ణాటకలోని మండ్లిగేరకు చెందిన గూని ఆంజనేయులు (45) బంధువు మండలంలోని సోంపురం గ్రామంలో మృతిచెందాడు. దీంతో ఆయన సోమవారం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు స్వగ్రామం నుంచి బైక్‌పై వెళ్తుండగా.. మార్గమధ్యంలో వాగు వద్ద బైక్ అదుపుతప్పి అందులో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులు ఘటన స్ధలానికి చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆంజనేయులుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నట్లు బంధువులు తెలిపారు.
డీసీఎం డ్రైవర్
దుర్మరణం
అడ్డాకుల: మండల కేంద్రంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందినట్ల ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని పొద్దుటూర్‌కు చెందిన కరీముల్లా (38) డీసీఎం డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. ఆదివారం సాయంత్రం బద్వేల్‌లో పాత ఇనుప సామగ్రి లోడ్ చేసుకొని షాద్‌నగర్‌కు బయలుదేరాడు. సోమవారం తెల్లవారుజామున అడ్డాకుల సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారి ఫ్‌లైఓవర్‌పై ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకే ఉన్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. రహదారి నిర్వాహకులు, పోలీసులు క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ వివరించారు. భార్య షేక్ మున్నీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
జడ్చర్ల కొత్త బస్టాండ్‌లో చోరీ
● 7 తులాల బంగారు
ఆభరణాలు అపహరణ
జడ్చర్ల: స్థానిక కొత్త బస్టాండ్‌లో సోమవారం ఓ ప్రయాణికురాలి బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ప్రత్యక్షుల కథనం మేరకు.. మిడ్జిల్ మండలం కొత్తూరుకు చెందిన వరలక్ష్మి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్లేందుకు సోమవారం జడ్చర్ల కొత్త బస్టాండ్‌లో దిగింది. కల్వకుర్తి బస్సు ఎక్కే సమయంలో హ్యాండ్‌బ్యాగులో దాచిన బ్రాస్‌లైట్, నక్లెస్, కమ్మలు, బుట్టాలు, చైన్ తదితర ఏడు తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. బస్సు ఎక్కిన తర్వాత హ్యాండ్‌బ్యాగు చైన్లు తెరచి ఉండటంతో బ్యాగులోని ఆభరణాలు చూసుకోగా కనిపించలేదు. దీంతో వెంటనే బస్సు డ్రైవర్‌కు సమాచారం ఇవ్వడంతో నేరుగా స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట ఆపి ప్రయాణికులను తనిఖీ చేసినా ఫలితం లేకపోయింది. బస్సు ఎక్కే సమయంలో రద్దీ అధికంగా ఉందని, అప్పుడే ఆభరణాలు అపహరించి ఉంటారని బాధితురాలు అనుమానం వ్యక్తం చేసింది. వాటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని వాపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.


