ఉత్సాహంగా టీ–20 లీగ్–2 పోటీలు
● గెలుపొందిన ఖమ్మం, నల్లగొండ జట్లు
● నేడు మహబూబ్‌నగర్– నిజామాబాద్ మధ్య మ్యాచ్
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఎండీసీఏ మైదానంలో జరుగుతున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ జిల్లాల టీ–20 లీగ్–2 మ్యాచ్‌లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఖమ్మం జట్టు 9 వికెట్ల తేడాతో వరంగల్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వరంగల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. జట్టులో శివరాం 31, చంద్ర 27, పర్దిపాన్ 25 పరుగులు చేశారు. ఖమ్మం బౌలర్లు మహేష్ చౌదరి 3, విశాల్ యాదవ్ 3, సిద్ధార్థ వాసిరెడ్డి 1 వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. 10.4 ఓవర్లలో వికెట్ కోల్పోయి 112 పరుగులు చేసింది. విశాల్‌యాదవ్ 41 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 71 పరుగులు నాటౌట్, హర్షిత్‌రెడ్డి 35 పరుగులు నాటౌట్‌గా నిలిచారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా విశాల్‌యాదవ్ (ఖమ్మం) నిలిచాడు.
86 పరుగుల తేడాతో..
మరో లీగ్ మ్యాచ్‌లో నల్లగొండ జట్టు 86 పరుగుల తేడాతో కరీంనగర్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నల్లగొండ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. జ్ఞానప్రకాశ్ 43 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 85 పరుగులు, జశ్వంత్ యాదవ్ 36 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60 పరుగులు, సాయినాథ్ పగిడిమరి 36 పరుగులు నాటౌట్ చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్ జట్టు 18.1 ఓవర్లలో 131 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులో విఘ్నేష్ 28, సయ్యద్ అఖ్‌దమ్ 17 పరుగులు చేశారు. నల్లగొండ బౌలర్లు సాయినాథ్ పగిడిమరి 3, అబ్దుల్ జీషాన్ 2 వికెట్లు తీశారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్రతిభచాటిన సాయినాథ్ పగిడిమరి (నల్లగొండ) మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా మంగళవారం ఉదయం 9 గంటలకు మహబూబ్‌నగర్– నిజామాబాద్, మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్– నిజామాబాద్ జట్లు తలపడనున్నాయి. అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన క్రీడాకారులకు రూ.5 వేల చెక్ అందజేశారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకట్, వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్, కోచ్‌లు అబ్దుల్లా, మన్నాన్, ముఖ్తార్‌అలీ తదితరులు పాల్గొన్నారు.


