గుంటల లెక్కన ప్లాట్ల విక్రయాలు
● వెంచర్ చేయకుండా వ్యాపారుల కొత్త ప్రయోగం
● అక్రమ అమ్మకాలపై స్పందించని యంత్రాంగం
అమరచింత: వ్యవసాయ పొలం సాగుకు పనికి రాదని అధికారులతో అనుమతి తీసుకుని ప్లాట్లుగా విభజించి రియల్టర్లు వ్యాపారం చేస్తారు. కానీ, ఇందుకు విరుద్ధంగా ఓ వ్యక్తి గుంటల లెక్కన పొలం అమ్ముతూ ప్లాట్ల దందాకు తెరలేపాడు. మండలంలోని సింగంపేట గ్రామంలో సర్వే నం.5ఆలో ఉన్న ఎకరా పొలాన్ని నాన్ అగ్రికల్చర్‌గా మార్చకుండా, డీటీసీపీ, పంచాయతీ అనుమతి లేకుండానే గుంటల లెక్కన భూమిని ప్లాట్లుగా చేసి అక్రమంగా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పొలం చదును చేసి వాటిని ఇప్పటి వరకు ఐదుగురికి గుంటల లెక్కన విక్రయించినట్లు తెలిసింది. అయితే ఇక్కడ గుంట లెక్కన కొన్న వారికి తర్వాత ఇల్లు నిర్మించుకునే సమయంలో అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫీజుతోపాటు ఇంటి నిర్మాణం కోసం అయ్యే ఖర్చులను సైతం పంచాయతీకి పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ప్లాట్ల దందా గతంలో పట్టణ శివారులోని నాగులకుంట సమీపంలోని పొలాలను సైతం గ్రీన్‌ల్యాండ్ పేరుతో గుంటల లెక్కన అమ్మినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి వ్యాపారాలు జోరందుకుంటున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఫిర్యాదు చేస్తే చర్యలు..
సింగంపేట గ్రామంలో నాన్ అగ్రికల్చర్ పర్మిషన్ తీసుకోకుండా వ్యవసాయ పొలాలను గుంటల లెక్కన విక్రయిస్తున్నారన్న విషయం మాకు తెలియదు. ఈ విషయమై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అక్రమంగా ప్లాట్ల విక్రయాలు జరిపితే చట్టపరంగా నేరం. – రవికుమార్‌యాదవ్, తహసీల్దార్, అమరచింత


