పాలమూరుకు నీళ్లు
మైగ్రేషన్ జిల్లాను ఇరిగేషన్ జిల్లాగా మార్చాం..
ఇక్కడి నుంచే మున్సిపల్ ఎన్నికల జైత్రయాత్ర..
భవిష్యత్ బీఆర్‌ఎస్ పార్టీదే
మోసం మాటలతో
కాంగ్రెస్ అధికారంలోకి..
కేసీఆర్ వస్తేనే
మైగ్రేషన్ జిల్లా కాదు.. ఇరిగేషన్‌కు మారుపేరుగా మార్చాం
బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు.. ఎత్తుకుపోయే బ్యాచ్..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘పాలమూరు అభివృద్ధి చెందాలంటే మళ్లీ కేసీఆరే రావాలి. ఐటీ హబ్ పునర్ వైభవం పొందాలంటే, ఉద్యోగాలు రావాలంటే, అమర్ రాజా కంపెనీ మళ్లీ రావాలన్నా, రైతులు, మహిళల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నా, భూముల ధరలు పెరగాలన్నా మళ్లీ కేసీఆర్ రావాలి’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో ఎస్‌వీఎస్ మెడికల్ కళాశాల నుంచి ఎంబీసీ మైదానం వరకు బీఆర్‌ఎస్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎంబీసీ మైదానం నిర్వహించిన బీఆర్‌ఎస్ నూతన సర్పంచులు, ఉపసర్పంచుల సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొడంగల్‌తో సహా 14 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందని చెప్పారు. అభ్య ర్థిగా ఎవరున్నా గులాబీ జెండాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలోనే ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుందన్నారు. 40 సర్పంచ్‌లు బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవడమే అందుకు నిదర్శనమన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో కష్టపడి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.
వలసలకు మారుపేరుగా ఉన్న పాలమూరు జిల్లాను బీఆర్‌ఎస్ హయాంలో ఇరిగేషన్ జిల్లాగా మార్చామని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు రిజర్వాయర్లతో సహా 90 శాతం పనులు పూర్తి చేశామన్నారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని చెప్పారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి జిల్లాలో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. పాలమూరులోని ఐటీ హబ్‌లో ఏర్పాటైన 14 పరిశ్రమలు ఎందుకు పారిపోయాయని ప్రశ్నించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్రలో ఆల వెంకటేశ్వరరెడ్డి 1,300 ఓట్లతో, మర్రి జనార్దన్‌రెడ్డి 5వేల ఓట్లతో, లక్ష్మారెడ్డి తక్కువ తేడాతోనే ఓటమి చెందారన్నారు. మళ్లీ కేసీఆర్ వస్తేనే పాలమూరుకు నీళ్లొస్తాయని, దుర్మార్గుల పాలనలో ఒక్క పని కూడా చేయరని చెప్పారు. పాలమూరు నుంచే మున్సిపల్ ఎన్నికల జైత్రయాత్ర కొనసాగాలన్నారు. మహబూబ్‌నగర్‌లో ఉన్న జోష్ పాలమూరులోని 14 నియోజకవర్గాలకు వ్యాపించాలని కోరారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుందని, ఇక భవిష్యత్ మొత్తం బీఆర్‌ఎస్ పార్టీదేనని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాకముందు గ్రామాల్లో కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఉంటేవి కాదని, తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చినట్లు తెలిపారు. తమ హయాంలో సర్పంచ్‌కు ఎలాంటి కష్టం లేకుండా చేశామన్నారు.
90 శాతం పనులు పూర్తయిన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పండబెట్టిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మోసం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కుటుంబాన్ని చీల్చాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మహబూబ్‌నగర్‌ను కార్పొ రేషన్ చేసినా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే
పాలమూరు బిడ్డనంటూ రేవంత్ గద్దెనెక్కారు
రెండేళ్లయినా ఒక్క పనీ చేయలేదు
పాలమూరు నుంచే మున్సిపల్ ఎన్నికల జైత్రయాత్ర
మహబూబ్‌నగర్‌లో సర్పంచుల సన్మాన కార్యక్రమంలో బీఆర్‌ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పాలమూరు బిడ్డగా చెప్పుకుంటే సెంటిమెంట్‌తో సీఎం అయిన రేవంత్‌రెడ్డి.. రెండేళ్లలో పాలమూరు కోసం ఒక్క పనైనా చేశారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రూ.2 వేల పెన్షన్‌ను రూ.4 వేలు ఇస్తానని చెప్పి రెండేళ్లయినా ఇవ్వలేదన్నారు. కల్యాణలక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని హామీ ఇచ్చారని, సీఎం రేవంత్‌కు బంగారం దుకాణాలు దొరకడం లేదా? లేక ఎవరూ నమ్మడం లేదా? అని ప్రశ్నించారు. వీళ్లు బంగారం ఇచ్చే బ్యాచ్ కాదని, పుస్తెలతాడుతో సహా ఎత్తుకుపోయే బ్యాచ్ అని చెప్పారు. గూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీస్తామని చెబుతున్నారన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెబుతున్నారని, అది జరగాలంటే కోటి కోట్లు కావాలని చెప్పారు. ఆడబిడ్డలకు స్కూటీలు కొనిస్తామని చెప్పి లూటీ మాత్రం చేస్తున్నారన్నారు.
పాలమూరుకు నీళ్లు


