17న సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన
● రూ.1,200కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
● పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: మంత్రి జూపల్లి కృష్ణారావు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 17వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించి.. దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో సీఎం పర్యటన సభా ఏర్పాట్లు, భద్రతా చర్యలు, మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పర్యటనలో భాగంగా ట్రిపుల్‌ఐటీ కళాశాల నిర్మాణం, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ, శాశ్వత తాగునీటి సరఫరా, ఎంవీఎస్ కళాశాల భవన నిర్మాణం వంటి అత్యంత కీలక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమాలు మహబూబ్‌నగర్ జిల్లా విద్యా, మౌలిక వసతుల అభివృద్ధికి మైలురాయిగా నిలవనున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని, సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. సభా ప్రాంగణం, వేదిక ఏర్పాట్లు, రహదారుల అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్య చర్యలు, భద్రత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనతో మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి మరింత ఊతం లభించనుందని, సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని అధికారులను కోరారు. అనంతరం జిల్లా అధికారులు ఇప్పటివరకు చేపట్టిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించగా.. మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్‌నాయక్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ఆర్‌డీఓ నవీన్, జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.


