28 నుంచి మన్యంకొండ జాతర
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఈనెల 28 నుండి మార్చి 5 వరకు నిర్వహించనున్న మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో వివిధ శాఖల అధికారులతో కలిసి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన తాగునీరు, శానిటేషన్, టాయిలెట్లు, బందోబస్తు రద్దీ నియంత్రణ వంటి సౌకర్యాలను కల్పించాలన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ముఖ్య శాఖల అధికారులతో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ప్రతి శాఖ నుంచి ఒక అధికారిని నియమించి ఏర్పాట్ల పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం ఫిబ్రవరి 1న స్వామి వారి గరుడ వాహనసేవ, రథోత్సవం ఉంటాయని ఈ సందర్భంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్‌శాఖ తరఫున అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ తగినన్ని బస్సులు నడపాలని, కొండపైకి మినీ బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. కొండ దిగువన అలివేలు మంగతాయారు దేవాలయం వద్ద ప్రత్యేక మెడికల్ క్యాంపులు, డాక్టర్లు, మందులు ఏర్పాటు చేయాలన్నారు. జాతర సందర్భంగా దేవాలయం చుట్టూ పక్కల మద్యపానాన్ని నిషేధించాలని ఎకై ్సజ్ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం మన్యంకొండ బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో దేవాలయ కమిటీ వంశపారంపర్య ధర్మకర్త అళహరి మధుసూదన్, కార్యనిర్వహణ అధికారి జి. శ్రీనివాసరాజు, ఏఎస్పీ రత్నం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


