ఆత్మహత్య కాదు.. హత్య
మానవపాడు: దళిత బిడ్డ డా.లావణ్య మృతి చాలా బాధాకరమని, ఆమెది ఆత్మహత్య కాదని.. హత్యేనని ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహరాజ్ అన్నారు. జల్లాపురంలో లావణ్య చిత్రపటానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లావణ్య మృతిచెంది రోజులు గడుస్తున్నా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నేటివరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమన్నారు. అధికారులు సైతం కులవివక్ష చూపారని ఆవేదన వ్యక్తంచేశారు. లావణ్య మృతికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. 50లక్షల ఆర్థికసాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు.


