ప్రేమ పేరుతో వంచించే వారిని శిక్షించాలి
మానవపాడు: ఆడబిడ్డలను ప్రేమ పేరుతో వంచించే వారిని కఠినంగా శిక్షించాలని.. నిందితుడు జైలు లో ఉండగానే పూర్తిస్తాయి విచారణ చేసి కఠిన శిక్ష అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం మానవపాడు మండలం జల్లాపురంలో డా.లావణ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంత రం మందకృష్ణ మాట్లాడుతూ.. దళిత వర్గానికి చెందిన వారిని ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడి ఆత్మహత్యలకు కారణమవుతున్నారని.. అలాంటి వారికి బెయిల్ కూడా ఇవ్వొద్దన్నారు. జాతీయ భద్ర త చట్టం, దేశద్రోహం కింద అరెస్ట్ అయితే దశాబ్దాలుగా జైలులో ఉండగానే శిక్షలు పడుతుంటాయని తెలిపారు. ప్రేమ పేరుతో మోసం చేయడాన్ని పెద్ద ద్రోహంగా పరిగణించి కఠినమైన చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడే మోసాలు తగ్గుతాయన్నారు. మోసం చేశారని ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని.. ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. అన్నింటికీ ఆత్మహత్య పరిష్కారం కాదన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన కోరారు.
ధైర్యంగా మోసం చేసే వారిని
ఎదుర్కోవాలి
ఆత్మహత్యలకు పాల్పడొద్దు
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు
మందకృష్ణ మాదిగ


