ఎల్సీ ఇవ్వలేదని పురుగుమందు డబ్బాతో ఆందోళన
మిడ్జిల్: ఎల్సీ ఇవ్వలేదని పురుగుల మందు డబ్బాతో రైతు స్థానిక సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. రైతు రాజేందర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని బోయిన్‌పల్లికి చెందిన రైతు వ్యవసాయ పొలం వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆదివారం మధ్యాహ్నం ఫ్యూజ్ ఎగిరిపోయింది. లైన్‌మెన్ బాలకిష్టయ్యకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా.. తాను అందుబాటులో లేనని సమాధానం ఇవ్వడంతో రైతు మిడ్జిల్ సబ్‌స్టేషన్‌కు వచ్చి ఎల్సీ ఇవ్వాలని ఆపరేటన్‌కు విజ్ఞప్తి చేశాడు. డ్యూటీలో ఉన్న ఆపరేటర్ తండ్రి మరణించడంతో అతడు వెళ్లిపోయాడు. విద్యుత్ ఏఈ అత్యవసరంగా వేరే ఆపరేటన్‌ను సబ్‌స్టేషన్‌కు పిలిచి విధులు నిర్వహించాలని కోరడంతో, వచ్చిన ఆపరేటర్‌ను రైతు ఎల్సీ ఇవ్వాలని కోరాడు. దీంతో లైన్‌మెన్ అడిగితేనే ఎల్సీ ఇస్తామని, మీరడిగితే ఇవ్వడం కుదరదని చెప్పడంతో రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. అనంతరం రైతు ఇంటికి వెళ్లి పురుగుల మందు డబ్బాతో సబ్‌స్టేషన్‌కు వచ్చాడు. ఎల్సీ ఇవ్వకపోతే మందు తాగి ఇక్కడే చనిపోతానని బెదిరించడంతో.. లైన్‌మెన్ బాలకిష్టయ్య సాయంత్రం 6.30 గంటలకు సబ్‌స్టేషన్‌కు వచ్చి ఫ్యూజ్ వేస్తానని రైతును సముదాయించడంతో సమస్య సద్గుమనిగింది. లైన్‌మెన్ అందుబాటులో లేకపోవడంతో కరెంట్ సమస్య వచ్చిన ప్రతిసారి ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు.


