ఉపాధి నిధులతో కొత్త పనులు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) వీజీజీ రామ్ (ఉపాధి హామీ) నిధులతో సరికొత్త పనులు చేపట్టేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామాల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తోంది. ఉపాధి నిధులతో మెటీరియల్ కంపోనెంట్ కింద గతంలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, కల్వర్టుల నిర్మాణాలు మాత్రమే చేసేవారు. అయితే పాత పద్ధతికి స్వస్తి పలుకుతూ కొత్త రకం పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో మహిళా సంఘాలకు సొంత భవనాల నిర్మాణం, ఆహార ధాన్యాలు నిల్వ చేసుకునేందుకు వంద మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలు, వివిధ రకాల పనులు చేసేవారికి వర్క్ షెడ్లు నిర్మించాలని నిర్ణయించారు. మహిళా భవనాలు, వర్క్‌షెడ్ల కోసం రూ.10 లక్షల చొప్పున, ఆహార ధాన్యాల నిల్వ కోసం చేపట్టే పనులకు రూ.30 లక్షలు కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా భవనాలకు ఇది వరకు ఎమ్మెల్యే, ఎంపీలు మాత్రమే తమ కోటా నిధుల నుంచి కేటాయించేవారు. అనేక చోట్ల అనువైన భవనాలు లేకపోవడంతో మహిళలు తమ సమావేశాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆహార ధాన్యాల నిల్వ కోసం ప్రతి గ్రామంలో గోదాంలను నిర్మిస్తే రైతులు తాము ఆశించిన ధర వచ్చినప్పుడే పంట దిగుబడులు విక్రయించుకోవడం, లేదా అవసరం ఉన్నన్ని రోజులు నిల్వ చేసుకోవడానికి వీలవుతుంది. వృత్తి, ఇతర పనులు చేసేవారికి షెడ్లు లేకపోవడంతో అద్దె గదుల్లోనే కాలం వెల్లదీస్తున్నారు. ఈ క్రమంలో ఉపాధి నిధులతో కొత్త తరహా పనులు చేపడితే ప్రజాప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
గ్రామసభలో ఆమోదం..
2025– 26 ఆర్థిక సంవత్సరానికి గాను మెటీరియల్ కంపోనెంట్ కింద కొత్త పనుల కోసం ప్రతిపాదనలు స్వీకరించనున్నారు. గ్రామస్థాయిలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు చేసి గ్రామసభలో ఆమోదం పొందాలి. అక్కడి నుంచి మండల స్థాయిలో, ఆ తర్వాత జిల్లాస్థాయిలో సాంకేతిక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామ కంఠం పరిధిలో ఉన్న భూముల్లోనే నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. అనువైన స్థలాలు ఉన్నచోట మూడు రకాల పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉంది. పాత విధానాలకు స్వస్తి పలికి కొత్త పనులు చేపట్టాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగిన పరిణామం అని చెప్పొచ్చు.
మహిళా సంఘాలకు
భవనాల ఏర్పాటుకు చర్యలు
ఆహార ధాన్యాల నిల్వ, ఇతర వర్క్ షెడ్ల నిర్మాణం
సీసీ రోడ్లు, కల్వర్టుల స్థానంలో.. ప్రతిపాదనలు తీసుకోవాలని ఆదేశాలు
రైతులకు మేలు..
ఉపాధి పథకంలో కొత్తగా ఆహార ధాన్యాల నిల్వకు అవసరమైన గోదాంలు, ఇతర వర్క్ షెడ్ల నిర్మాణాలు చేపట్టవచ్చు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కూలీలకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ కొత్త పనులతో రైతులకు మేలు జరుగుతుంది.
– నర్సింహులు, డీఆర్‌డీఓ
ఉపాధి నిధులతో కొత్త పనులు


