నేడు బీసీ సామాజిక న్యాయసభ
మెట్టుగడ్డ: 42శాతం బీసీ రిజర్వేషన్ల సాధన – 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్‌తో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం బీసీ సామాజిక న్యాయసభను నిర్వహిస్తున్నట్లు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు రమేశ్‌గౌడ్ ప్రకటనలో తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఫౌండర్ చైర్మన్ చిరంజీవులు, మాజీ సుప్రీం కోర్టు జడ్జి జస్టీస్ ఈశ్వరయ్య, వి శారదన్ మహారాజ్, సంగెం సూర్యారావు పా ల్గొంటున్నట్లు తెలిపారు. కావున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.
కేటీఆర్ సభ ఏర్పాట్ల పరిశీలన
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఈనెల 12వ తేదీన బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఎంబీసీ మైదానంలో బహిరంగసభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సభా వేదిక, పార్కింగ్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డుమెంబర్లను కేటీఆర్ సన్మానిస్తారని పేర్కొన్నారు. సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, పట్టణ అధ్యక్షుడు శివరాజు, మున్నూరురాజు, ప్రభాకర్, వర్ధభాస్కర్, కిషన్, రమేష్, సత్తి, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు నిబంధనలు పాటించాలి
అడ్డాకుల: ప్రతిఒక్కరూ రోడ్డు నిబంధనలను పాటించాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. అడ్డాకుల మండలం శాఖాపూర్ టోల్‌ప్లాజా వద్ద శనివారం 37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా ద్విచక్ర వాహనదారులతో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా తలకు హెల్మెట్ ధరించాలని చెప్పారు. రోడ్డు నిబంధనలను పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కోరారు. రాంగ్‌రూట్లో వాహనాలను నడుపొద్దని సూచించారు. సెల్‌ఫోన్లో మాట్లాడుతూ, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయరాదన్నారు. కారులో ప్రయాణించే వారు తప్పకుండా సీటుబెల్టు పెట్టుకోవాలని చెప్పారు. అతివేగం ప్రమాదాలకు కారణమవుతుందన్నారు. రోడ్డు నిబంధనలను పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌ఫెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ శ్రీనివాస్, ప్రాజెక్టు హెడ్ అరుణ్‌కుమార్, ప్లాజా మేనేజర్ కార్తీక్, వివిధ విభాగాల ఇన్‌చార్జిలు కిశోర్‌రెడ్డి, రఘునందన్‌గౌడ్, సురేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
వేరుశనగ క్వింటా రూ.8,641
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో శనివారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.8,641, కనిష్టంగా రూ.6,495 ధరలు లభించాయి. ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ క్వింటా గరిష్టంగా రూ.2,759, కనిష్టంగా రూ.1,601, హంస రూ.1,929, కందులు గరిష్టంగా రూ.6,921, కనిష్టంగా రూ.5,116, పత్తి గరిష్టంగా రూ.7,599, కనిష్టంగా రూ.5,699, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,965, కనిష్టంగా రూ.1,761, ఉలువలు గరిష్టంగా రూ.4,250, కనిష్టంగా రూ.4,202, మినుములు గరిష్టంగా రూ.8,150, కనిష్టంగా రూ.7,999 ధరలు లభించాయి. దేవరకద్రలో కందులు గరిష్టంగా రూ.6,759గా ఒకే ధర నమోదయ్యాయి.
నేడు బీసీ సామాజిక న్యాయసభ


