ప్రజల ‘ఉపాధి’ని కాలరాస్తున్న బీజేపీ
స్టేషన్ మహబూబ్‌నగర్: దేశంలోని బడుగు, బలహీనవర్గాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 2005లో యూపీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొస్తే ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నదని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టంలో మార్పులు తీసుకొచ్చి ప్రజల ఉపాధి హక్కును కాలరాస్తున్నదని విమర్శించారు. ఉపాధి హామీ చట్టంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడం సరికాదన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 20నుంచి 30వరకు జిల్లాలోని 423 గ్రామాల్లో పర్యటించి ఈ చట్టాన్ని యాథావిధిగా అమలు చేసేలా గ్రామసభలు నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధి హామీ చట్టంలో జరుగుతున్న అన్యాయం గురించి ప్రజలకు తెలియజేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో పర్యటనలు చేస్తారని, అందులో భాగంగా వచ్చే నెల 3న లక్షమందితో మహబూబ్‌నగర్ నుంచే సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, నాయకులు చంద్రకుమార్‌గౌడ్, వినోద్‌కుమార్, ఎన్‌పీ.వెంకటేశ్, దుష్యంత్‌రెడ్డి, లింగంనాయక్, సీజే బెనహర్ తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్


