ఊరెళ్తున్నారా.. జర జాగ్రత్త!
మహబూబ్‌నగర్ క్రైం: సంక్రాంతి పండగ నేపథ్యంలో నేటి నుంచి ఈనెల 18 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో నగరంతో పాటు పట్టణాల్లో ఉండే చాలా మంది గ్రామీణా ప్రాంతాలకు, యాత్రల పేరుతో ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇదే అదునుగా చోరులు ఇంటికి కన్నం వేస్తుంటారు. పేద, మధ్య తరగతి ప్రజలు కష్టపడి దాచుకున్న బంగారం.. అవసరాలకు కూడబెట్టుకున్న నగదును ఒక్కరాత్రిలో దోచుకుపోతే వారి బాధ వర్ణణాతీతం.
ఆటో ద్వారా ప్రచారం: నగరంలో దొంగతనాలపై ప్రజలను అప్రమత్తం చేయడానికి టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ ఆధ్వర్యంలో ఆటోలకు సూచనలతో కూడిన బ్యానర్స్ ఏర్పాటు చేసి కాలనీలు, వీధుల వెంట తిరుగుతూ కర్రపత్రాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఇంటికి తాళం వేసి వెళ్లే వాళ్లు ఇంట్లో విలువైన వస్తువులు పెట్టొద్దని సూచించారు. అలాగే పోలీస్ శాఖ కూడా నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కన్పిస్తే డయల్ 100, 112, జిల్లా పోలీస్ కంట్రోల్ రూం 87126 59360 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.
దొంగల ఎదురుచూపులు: ఎప్పుడు సెలవులు వస్తాయా.. ఎప్పుడూ ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్తారా..? అవి గమనించే దొంగలు అణువంత అవకాశం దొరికినా ఉన్నదంతా ఊడ్చుకెళ్తారు. పట్టణాల్లో ఎండాకాలం సెలవుల్లోనే చోరీలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ వేసవి సెలవుల్లో ఇప్పటికే చాలా మంది ఇళ్లకు తాళాలు వేసి సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. దొంగలకు ఇది అదనుగా కాకూడదంటే అవసరమైన భద్రత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే తాళం వేసిన ఇళ్లు రాత్రికి రాత్రి లూటీ అవుతాయి. బస్సులో ప్రయాణించేందుకు వెళ్తే ఖరీదైన వస్తువులు మాయమవుతున్నాయి.. బ్యాంకులకు వెళ్తే ముఠాలు నగదుని దోచుకెళ్తున్నాయి. ఇలా ప్రతీ చోటా దొంగలు, దోపిడీ ముఠాల బెడద పెరిగింది. దీంతో పట్టణవాసులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. అయితే చోరీల కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నా, ప్రజలు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఉత్తమం.
రాత్రి పగలు తేడా లేకుండాక్షణాల్లో చోరీలు
పోయేది రూ.కోట్లలో స్వాధీనం రూ.లక్షల్లో
తక్కువగా రికవరీ శాతం
జిల్లా కేంద్రంలో చోరీల పరంపర
తాళం వేసిన ఇంటిని వదలని దొంగలు
చోరీలు జరుగుతూనే ఉన్నాయి:
మహబూబ్‌నగర్ సబ్ డివిజన్ పరిధిలో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయినా కూడా గస్తీని పెంచినా దొంగలు తమ పని కానిచ్చేస్తున్నారు. దొంగలు ప్రధానంగా పట్టణ శివారు కాలనీలను, జన సంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఇన్ని చోరీలు జరుగుతున్నా ప్రజలు ఇప్పటికీ అప్రమత్తంగా వ్యవహారించడం లేదు. చోరీలు జరిగిన తర్వాత ఫిర్యాదులు చేస్తున్నారు తప్పా ముందస్తు జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం లేదు. దీంతో చాలా వరకు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది.
సెలవుల ‘దడ’: ప్రస్తుతం పోలీసుల్లోనూ వేసవి సెలవుల ‘దడ’ పుట్టుకుంది. సెలవుల్లో చాలా మంది తమ ఇళ్లకు తాళాలు వేసి దూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ప్రతీ ఒక్కరి దృష్టి పండుగ వేడుకల మీద ఉంటుంది. ఇదే సమయంలో తాళం వేసిన ఇళ్లు లక్ష్యంగా దొంగలు రెచ్చిపోయే అవకాశం లేకపోలేదు. గతంలో ఈ సీజన్‌లో దొంగతనాలు కేసులు భారీగా నమోదయ్యాయి. రోజురోజుకూ నేరగాళ్ల సంఖ్య పెరుగుతుండటంతో వారిని గుర్తించడం పోలీసులకు తలనొప్పిగా మారింది.
ఊరెళ్తున్నారా.. జర జాగ్రత్త!


