చైన్‌స్నాచింగ్ కేసులో నిందితుల అరెస్టు
నర్వ: 2024 ఏడాదిలో బైక్‌పై వచ్చి మహిళ మెడలో బంగారు గొలుసును అపహరించిన చైన్‌స్నాచింగ్ కేసులో ముగ్గురు నిందితులను నర్వ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ పబ్బతి రమేశ్ కథనం ప్రకారం.. 9అక్టోబర్ 2024లో 24గ్రాముల బంగారు గొలుసును బైక్‌పై వచ్చి లాక్కొని పరారైన కేసులో రాజుపల్లికి చెందిన జయప్రద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు. నమ్మదగిన సమాచారం మేరకు సుధీర్ఘ దర్యాప్తు అనంతరం మహిళలను లక్ష్యంగా చేసుకొని బైక్‌పై వచ్చి బంగారు గొలుసులను అపహరిస్తున్న ముగ్గురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇందులో అమరచింత మండల నాగల్‌కడ్మూర్‌కు చెందిన ఏ–1 కుర్వరాములు, ఏ–2 గట్టు వెంకటేశ్, ఏ–3 డ్యాం వెంకటేశ్ ఉన్నారు. వీరిని ఆదివారం పోలీస్‌కస్టడీలోకి తీసుకొని నారాయణపేట కోర్టులో హాజరుపర్చామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు.
దీపం మంటలు
వ్యాప్తి చెంది ఇల్లు దగ్ధం
మహబూబ్‌నగర్ క్రైం: వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం కృష్ణవేణి అనే మహిళ ఇంట్లో ఉదయం పూజ చేసి దీపం పెట్టి కూలీ పనికి వెళ్లింది. ఆ తర్వాత దీపం ద్వారా ఇంట్లో మంటలు వ్యాప్తిచెంది ఇంట్లో ఉన్న దుస్తులు, వంట సామగ్రి, వస్తువులు ఇతర గృహోపకరాలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకుని మంటలు అదుపు చేసింది. ఇల్లు దగ్ధం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కృష్ణవేణి, ఆమె కుమారుడికి వన్‌టౌన్ సీఐ అప్పయ్య నెలరోజులకు ఉపయోగపడే నిత్యావసర వస్తువులు, వంట సామగ్రి, ఇతర వస్తువులను డీఎస్పీ వెంకటేశ్వర్లు చేతులమీదుగా అందించారు.
చెరువులో మహిళ
మృతదేహం లభ్యం
నాగర్‌కర్నూల్ క్రైం: గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన జిల్లా కేంద్రంలోని కేసరిసముద్రం చెరువులో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గోవర్ధన్ తెలిపిన వివరాలు.. కేసరిసముద్రం చెర్వు బతుకమ్మ ఘాట్ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జనరల్ ఆస్పత్రికి తరించారు. మృతురాలి వయస్సు 50 ఏళ్లు ఉంటుందని ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని పోలీసులు పేర్కొన్నారు.
పందిని తప్పించబోయి ఆటోబోల్తా..
● ఇద్దరికి తీవ్రగాయాలు
గోపాల్‌పేట: గ్రామంలో రోడ్డుకు అడ్డంగా వచ్చిన పందిని తప్పించబోయి ఓ ఆటో బోల్తా కొట్టగా ఇద్దరు వృద్ధులు గాయాలపాలైన ఘటన చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. ఏదుల మండలంలోని మాచుపల్లికి చెందిన ఆటో ఉదయం 9 గంటల ప్రాంతంలో మాచుపల్లి నుంచి ఏదుట్ల, గోపాల్‌పేట మీదుగా వనపర్తి వెళ్తోంది. గోపాల్‌పేట సబ్‌స్టేషన్ దాటి రాంనగర్ కాలనీసమీపంలో వెళ్తుండగా ఓ పంది రోడ్డుపైకి వచ్చింది దీంతో ఆటోడ్రైవర్ పందిని తప్పించేందుకు ప్రయత్నించగా ఆటోబోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఇద్దరు వృద్ధులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంతలోనే ఎదురుగా వచ్చిన ఓ ద్విచక్రవాహనం సైతం ఆటోను ఢీకొట్టి ద్విచక్రవాహనం నడిపిన వృద్ధుడు సైతం కిందపడిపోయాడు. ఆటో ఇంజిన్ బంద్‌కాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతం మొత్తం పొగతో నిండిపోయింది. కింద పడిన ఇద్దరు వృద్ధులకు తలకు, కాళ్లు, చేతులకు రక్తగాయాలయ్యాయి. అనంతరం ఇద్దరిని వెంటనే గోపాల్‌పేట పీహెచ్‌సీకి తరలించా రు. పందుల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని పాలకులు, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


