ప్రపంచ సంపద కార్పొరేట్ చేతుల్లో
నారాయణపేట: వెనిజువేలా మాజీ అధ్యక్షుడు మదురోను అక్రమంగా ఎత్తుకెళ్లడం ఒక సార్వభౌమాధికారం కలిగిన దేశంపై దౌర్జన్యంగా వ్యవహరించడం అన్యాయమని, ప్రపంచ పోలీసులా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్సార్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో సీపీఎం విస్తృత స్థాయి జిల్లా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ఉక్రెయిన్, రష్యా, పాలస్తీనా ఇజ్రాయిల్ తదితర యుద్ధాలకు అమెరికన్ కారణమవుతుందని, ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది అమెరికానేనన్నారు. యుద్ధాలను ప్రేరేపించడం, ఆయుధాలను అమ్ముకోవడం, కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు చేయడం ట్రంప్ విధానాలుగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో నిరుద్యోగం, దరిద్రం, ఆకలి ఒకవైపు పెరిగిపోతుండగా, మరోవైపు ప్రపంచ సంపద అంతా కొద్ది మంది బడా కార్పొరేట్ శక్తుల్లో కేంద్రీకృతమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారీ విధానాలు శాంతి, సౌభాగ్యాలను కాపాడలేవన్నారు. బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడిన వీరోచిత వారసత్వం కలిగిన దేశం భారతదేశమని, కానీ నేడు మన ప్రధాని మాత్రం ప్రపంచ పోలీసులా వ్యవహరిస్తున్న ట్రంప్ విధానాలను ఖండించడం లేదని విమర్శించారు. మోదీ బడా కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంభిస్తూ కార్మిక, కర్షక, కూలీల వ్యతిరేక విధానాలను గౌరవిస్తుందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు జీ రాంజీ బిల్లును తెచ్చారన్నారు. స్వాతంత్య్రం పూర్వం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నిటినీ యజమానులకు అనుకూలంగా మార్చేందుకు నాలుగు కార్మిక కోడ్లు తెచ్చారని మండిపడ్డారు. అదే విధంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం పార్టీ సమరశీలంగా పోరాటం చేస్తుందన్నారు. దేశంలో పలువురు మతోన్మాద విధానాలు అవలంభిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ విధానాలను తీసుకొస్తున్నారన్నారు. కేంద్రంలో పరిపాలిస్తున్న పాలకులకు లౌకిక రాజ్యమన్న సోషలిజం అన్న నచ్చడం లేదని అందుకే భారత రాజ్యాంగంలో లౌకిక సోషలిస్ట్ పదాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చివరికి రాజ్యాంగాన్ని మార్చి అసమానతల కూడుకున్న మనధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సీపీఎం పార్టీ మద్దతుతో నూతంగ ఎన్నికై న నలుగురు సర్పంచులను ఎర్ర కండువాలతో అభినందించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రాంరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గోపాల్, అంజిలయ్యగౌడ్, బల్‌రాం, పుంజనూర్ ఆంజనేయులు, కాశప్ప, జోషి పాల్గొన్నారు.
సీపీఎం తెలంగాణ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శ


