వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడనే హత్య
గద్వాల క్రైం: వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో నిందితుడు అబ్రహం ఖయ్యూం అనే యువకుడిని హత్య గావించినట్లు గద్వాల డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. శనివారం గద్వాల సీఐ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో హత్య కేసు వివరాలు వెల్లడించారు. గట్టు మండలం బల్గెర గ్రామానికి చెందిన తిమ్మప్ప(ఖయ్యూం) (28) మేసీ్త్ర పనులు చేస్తుంటాడు. ఈ నెల 4న రాయచూర్‌కు వెళ్లి తిరిగి బల్గెరకు వస్తున్న క్రమంలో తండ్రి సనక దేవన్నకు ఫోన్‌చేసి బల్గెర బస్టాప్ వద్దకు బైక్ తీసుకొని రమ్మన్నాడు. బస్టాప్ వద్ద తండ్రి వేచి చూస్తున్నప్పటికీ ఎంతకు రాలేదు. మరుసటి రోజు 5వ తేదీన ఖయ్యూం ఆచూకీ కోసం వెతకగా ముసల్మాన్‌దొడ్డి అటవీ ప్రాంతంల్లో అతని బైక్, కొంత దూరంలో మోకాళ్లపై తలపెట్టుకొని రక్తపు మడుగులో మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. దీంతో మృతుడి తండ్రి దేవన్న గట్టు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ మల్లేష్, సీఐ శ్రీను కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వెలుగులోకి ఇలా...
మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి సోదరుడు ఏబేలు(మేసీ్త్ర) ఆరు నెలల క్రితం బల్గెరలో ఇంటి నిర్మాణ పనులు చేస్తూ గోడ కూలి మృతి చెందాడు. అయితే మిట్టదొడ్డి గ్రామానికి చెందిన అబ్రహం(మేసీ్త్ర) అనే వ్యక్తి ఏబేలుకు స్నేహితుడు కావడంతో తరచూ అతని ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఏబేలు భార్యతో వివాహేతర బంధం ఏర్పడింది. ఇది గమనించిన తిమ్మప్ప తన వదిన ఇంటి వైపునకు అబ్రహాన్ని రావద్దని మందలించాడు. తిమ్మప్పపై ద్వేషం పెంచుకున్న అబ్రహం ఎలాగైనా అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో ఈ నెల 4వ తేదీన మద్యం తాగుదామని ఫోన్ చేసి రమ్మన్నాడు. బల్గెర గ్రామానికి చేరుకొని ఇద్దరు కలసి అక్కడే మద్యం కొనుగోలు చేసి రెండు బైకులపై ముసల్మాన్‌దొడ్డి అటవీ ప్రాంతం వైపునకు వెళ్లారు. నిర్మానుష ప్రాంతంలో మద్యం సేవించారు. ఈ నేపథ్యంలో అబ్రహం బండరాయితో మద్యం మత్తులో కూర్చన్న తిమ్మప్ప తలపై వెనుక నుంచి బలంగా మోదాడు. దాడిలో మృతుడు తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అబ్రహం మృతుడి సెల్‌ఫోన్ తీసుకొని మాచర్ల గ్రామ శివారులోని చెరువులో పడేసి వెళ్లిపోయాడు. మృతుడి సెల్‌ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన క్రమంలో నేరస్తుడు అబ్రహంగా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. నేరస్తుడుని గుర్తించేందుకు రెండు బృందాలచే గాలింపు చర్యలు చేపట్టిన క్రమంలో అబ్రహం అయిజ చౌరస్తా సమీపంలో బైక్‌పై వెళ్తున్నట్లు సమాచారం మేరకు శనివారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించగా తిమ్మప్పను హత్య చేసినట్లు నేరం అంగీకరించాడన్నారు. నిందితుడు నుంచి బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని సీజ్ చేసి గద్వాల కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్య కేసులో ఒక్కడే ఉన్నాడ లేక ఇతరులు ఉన్నారనే అంశాలపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సీఐ శ్రీను, ఎస్‌ఐ కేటీ మల్లేష్, సిబ్బంది పాల్గొన్నారు.
వివరాలు వెల్లడించిన డీఎస్పీ మొగిలయ్య


