మట్టి తరలింపును అడ్డుకున్న పోలీసులు
చిన్నచింతకుంట: మండలంలోని ఉంద్యాలలో శనివారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు గ్రామస్తులు మట్టిని తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా మట్టిని అక్రమంగా ట్రాక్టర్లలో తరలిస్తున్నట్లు గుర్తించి.. పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. గ్రామంలోని ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కోట్ల ఆంజనేయులు, ఉపసర్పంచ్ బండారు యోన, బీఆర్‌ఎస్ నాయకుడు చంద్రాయుడు మాట్లాడుతూ.. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు మట్టి, ఇసుక అందించకపోవడంతో మధ్యలోనే నిర్మాణాలు నిలిచిపోయాయని తెలిపారు. ఇళ్ల బేస్‌మెంట్‌లు పూడ్చేందుకు మట్టి అవసరమని వారం రోజుల క్రితం అధికారులను సంప్రదిస్తే స్పందించడం లేదన్నారు. దీంతో చేసేదేమీ లేక గ్రామ శివారులోని రైతు పొలం నుంచి మట్టిని తరలిస్తుండగా.. పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసులు మట్టి ట్రాక్టర్లను వదిలిపెడితేనే ఆందోళన మిరమిస్తామని భీష్మించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ ఎల్లయ్య గ్రామానికి చేరుకొని మట్టి తరలింపునకు అనుమతులు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఆందోళనకు దిగిన గ్రామస్తులు


