ప్రాణం తీసిన.. బైక్ సరదా
కల్వకుర్తి టౌన్: ముక్కుపచ్చలారని వయస్సులో బైక్ నడపాలన్న సరదా.. అతివేగంగా దూసుకెళ్లడంతో ఓ బాలుడి నిండు ప్రాణం బలితీసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కొడుకు అకాల మృతి.. ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. ఈ విషాదకర ఘటనకు సంబంధించి వివరాలు ఏఎస్‌ఐ శ్రీనివాసులు కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని గాంధీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న రఘుపతి పెయింటింగ్ పని, సునీత ఇంట్లోనే టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఒక్కగానొక్క కుమారుడు సాయి ప్రణీత్(13) స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో శనివారం ఉదయం గాంధీనగర్ నుంచి తన ఉన్న సైకిల్ తీసుకొని వరుసకు మామ అయిన వారి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్న బైక్ తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరిన వికాస్ కొద్దిసేపటికే ఎక్సలెంట్ స్కూల్ వద్దకు రాగానే, వేగాన్ని నియంత్రించలేక బైక్‌ను ఓ ఇంటి ర్యాంపు పై ఎక్కించి అక్కడే ఉన్న బెంచీని ఢీకొని పక్కనే ఉన్న మురుగుకాల్వలో పడి తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న తల్లి ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడన్న విషయం తెలిసి సొమ్మసిల్లి పడిపోగా ఆమెకు అక్కడే ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ ఘటనపై బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
అతివేగంగా వెళ్లి కిందపడటంతో
బాలుడి దుర్మరణం
ప్రాణం తీసిన.. బైక్ సరదా


