బాలుడి ప్రాణం తీసిన వాటర్ హీటర్
ఖిల్లాఘనపురం: ఇంట్లో ఆడుకుంటూ వాటర్ హీటర్ వైరు పట్టుకున్న బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన ఘటన ఖిల్లాఘనపురం మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఖిల్లాఘనపురం గ్రామానికి చెందిన సింగనమోని వెంకటేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు చైతన్యరామ్ (10) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం ఇంటి వద్ద ఉండగా.. రోజు మాదిరిగానే పిల్లల స్నానానికి వేడి నీటి కోసం సరిత వాటర్ హీటర్ పెట్టింది. ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వాటర్ హీటర్ వైరును చైతన్యరామ్ పట్టుకోవడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
అడ్డాకుల: మూసాపేట మండలం జానంపేట సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. బాధితుల వివరాల ప్రకారం.. గద్వాలకు చెందిన వీరశేఖర్, రంగన్న ద్విచక్రవాహనంపై మహబూబ్‌నగర్ నుంచి గద్వాలకు వెళ్తున్నారు. జానంపేట వద్ద అదే గ్రామానికి చెందిన లక్ష్మయ్య ద్విచక్ర వాహనంపై రాంగ్‌రూట్లో వచ్చి వీరశేఖర్, రంగన్న బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలపై ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో లక్ష్మయ్య, వీరశేఖర్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. లక్ష్మయ్య రాంగ్‌రూట్లో వచ్చి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


