నేటినుంచి టీ–20 రెండోదశ పోటీలు
● హాజరుకానున్న పదిజట్లు, ఐదు లీగ్ మ్యాచ్‌లు
● 13న తలపడనున్న
మహబూబ్‌నగర్–నిజామాబాద్ జట్లు
మహబూబ్‌నగర్ క్రీడలు: కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ జిల్లాల టీ–20 లీగ్ రెండో ఫేజ్ పోటీలు తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు రెండో ఫేజ్ పోటీలకు మహబూబ్‌నగర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆదివారం నుంచి ఈనెల 13వ తేదీ వరకు పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో టీ–20 లీగ్ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజులపాటు ఆయా జిల్లాల క్రీడాకారులకు మైదానంలో టిఫిన్, భోజన సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. ఎండీసీఏ మైదానంలో ఏర్పాటు చేసిన టర్ఫ్ వికెట్‌పై ఇతర జిల్లాల జట్ల మ్యాచ్‌లు జరగనున్నాయి. మైదానంలో ఏర్పాటు చేసిన సైడ్ స్క్రీన్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
పది జట్లు, ఐదు లీగ్ మ్చాచ్‌లు
ఎండీసీఏ మైదానంలో జరిగే కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ జిల్లాల టీ–20 లీగ్ రెండో ఫేజ్ పోటీలకు మహబూబ్‌నగర్ జట్టుతోపాటు మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ జట్లు పాల్గొంటున్నాయి. మూడు రోజులపాటు ఐదు లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు మెదక్–రంగారెడ్డి, మధ్యాహ్నం ఒంటిగంటకు ఆదిలాబాద్–హైదరాబాద్, 12న ఉదయం 9గంటలకు వరంగల్–ఖమ్మం, మధ్యాహ్నం కరీంనగర్–నల్గొండ, 13న ఉదయం 9 గంటలకు మహబూబ్‌నగర్–నిజామాబాద్ జట్లు తలపడనున్నాయి.
మ్యాచ్‌ల నిర్వహణకు
అన్ని ఏర్పాట్లు
కాకా వెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ జిల్లాల టీ–20 లీగ్ రెండో ఫేజ్ పోటీల్లో కొన్ని మ్యాచ్‌లను మహబూబ్‌నగర్ ఎండీసీఏ మైదానంలో నిర్వహించే అవకాశం కల్పించినందుకు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. మైదానంలో ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. మ్యాచ్‌ల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పోటీలను పురస్కరించుకొని పలువురు హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కోచ్‌లు అబ్దుల్లా, ముఖ్తార్‌అలీ, క్యూరెటర్ సత్యనారాయణ యాదవ్, సీనియర్ క్రీడాకారుడు రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేటినుంచి టీ–20 రెండోదశ పోటీలు


