ఒకే ఊరు.. మూడు పేర్లు
మదనాపురం: కాలచక్రం తిరుగుతున్న కొద్దీ మనుషుల జీవనశైలే కాదు.. ఊర్ల పేర్లు, ఉనికి కూడా మారుతుంటా యి. అందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది మదనాపురం మండలంలోని నిలివిడి. ఒకే గ్రామ పంచాయతీ కానీ.. మూడు పేర్ల చరిత్ర ఈ ఊరి సొంతం. ఈ విచిత్ర పరిణామం వెనుక తరాల చరిత్ర, వలసల గాథ దాగి ఉంది.
కాలగర్భంలో నెల్లూరు..
ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని నెల్లూరు అని పిలిచే వారు. పాత తరం నోళ్లలో ఇప్పటికీ ఆ పేరు నానుతూనే ఉంది. అయితే కాలక్రమేణా ఆ ఉచ్చారణ మారి నిలివిడిగా స్థిరపడింది. సుమారు 1500 జనాభా, 930 మంది ఓటర్లతో కళకళలాడే ఈ గ్రామంలో మెజార్టీ ప్రజలు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. వ్యవసాయం, కూలీ పనులే వీరి ప్రధాన జీవనాధారం.
గ్రామస్తులు ఏమంటున్నారంటే..
తమ చిన్నతనంలో పెద్దలు ఊరిని నెల్లూరు అని పిలిచేవారని గ్రామస్తులు తెలిపారు. అయితే ప్రభు త్వ రికార్డులు, వాడుకలో అది నిలివిడిగా మారిపోయిందని పేర్కొంటున్నారు. పేరు ఏదైనా ఈ మట్టి తమకు ప్రాణమని.. తాము ఇక్కడే పుట్టి పెరిగామని.. ఊరు పెరిగి రెండుగా చీలిపోయినా తమ బంధాలు మాత్రం అలాగే ఉంటాయంటున్నారు.
లక్ష్మీపురం కాలనీ
నెలివిడి గ్రామం
కొత్త కాలనీకి లక్ష్మీపురం పేరు..
గ్రామ చరిత్రలో 2000వ సంవత్సరం ఒక మైలురాయి. గ్రామంలోని కొందరు తమ పొలం పనుల అవసరాల కోసం, రవాణా సౌకర్యాల కోసం ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఆత్మకూర్, కొత్తకోట ప్రధాన రహదారి వద్దకు మకాం మార్చారు. అలా వెళ్లిన వారు అక్కడ కొత్త కాలనీని ఏర్పాటు చేసుకున్నారు. భవిష్యత్‌పై నమ్మకంతో లక్ష్మీపురం అని నామకరణం చేసుకున్నారు. నేడు నిలివిడి అంటే తెలియని వారు కూడా లక్ష్మీపురం అంటే గుర్తుపట్టేలా ఆ కాలనీ అభివృద్ధి చెందింది.
ఒకే ఊరు.. మూడు పేర్లు


