‘పది’ విద్యార్థులకు ‘ప్రత్యేక’ స్నాక్స్
ఫిబ్రవరి 16నుంచి మార్చి10వరకు అల్పాహారం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్న క్రమంలో వారికి సాయంత్రం చిరుతిళ్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా నిధులను విడుదల చేస్తూ.. ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం, సాయంత్రం నిర్వహించే ప్రత్యేక తరగుతలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆకలితో ఉండకుండా ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు అందించే స్నాక్స్ కేవలం 19రోజులపాటు అందించనుంది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు చిరుతిళ్లను అందించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగుతులు జరుగుతున్నా.. వాటిని సకాలంలో అందించకుండా విద్యాసంవత్సరం చివరన అందించడంతో పెద్దగా ప్రయోజనం ఉండదని ఉపాధ్యాయ సంఘం నాయకులు పేర్కొంటున్నారు.
బిస్కెట్‌లు, పల్లీలు
ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు బిస్కెట్‌లు, పల్లీలు, ఉడకబెట్టిన పెసర్లు, బెబ్బర్లు, శనగలు, పల్లిబెల్లం, మిల్లెట్ బిస్కెట్స్, ఉల్లిగడ్డ పకోడి వంటివాటిని అందించనున్నారు. ఇందుకు ఒక్కో విద్యార్థిపై రూ.15ఖర్చు చేయనునన్నారు. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 459 పాఠశాలల్లో చదువుతున్న 19, 495 మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.55, 56, 918 నిధులను విడుదల చేసింది. వీటిని ప్రభుత్వం డీఈఓ ఖాతాలో జమచేయనుంది. వాటిని వివిధ పాఠశాలల హెచ్‌ఎంలకు అవసరమైన విధంగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంది.
కలెక్టర్ నిధుల నుంచి అందిస్తున్నాం
నవంబర్ చివరివారం నుంచి జిల్లావ్యాప్తంగా విద్యార్థులకు స్నాక్స్ అందిస్తున్నాం. ఒక్కో విద్యార్థికి రూ.5చొప్పున కలెక్టర్ నిధుల నుంచి ఖర్చుచేసి బిస్కెట్‌లు పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వం స్నాక్స్ కోసం నిధులను కూడా విడుదల చేసింది. ఎటువంటి ఆటంకం లేకుండా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం.
– ప్రవీణ్‌కుమార్, డీఈఓ, మహబూబ్‌నగర్
ఉడకబెట్టిన పెసర్లు, బెబ్బర్లు, బెల్లంపట్టి, మిల్లెట్ బిస్కెట్స్
ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15ఖర్చు చేయనున్న ప్రభుత్వం
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 459హైస్కూళ్లలో 19,495మందికి ప్రయోజనం
‘పది’ విద్యార్థులకు ‘ప్రత్యేక’ స్నాక్స్


