30 నుంచి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు
గద్వాల టౌన్: గద్వాల కోటలో వెలసిన శ్రీభూలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వారంరోజుల పాటు ఈ వేడుకలు మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో జరగనున్నాయి. వేడుకలను పురస్కరించుకొని ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 18 ఏళ్ల క్రితం గద్వాల కోటలోని ఆలయ పరిసర ప్రాంతాలు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంత్రాలయ మఠానికి అప్పగించారు. గద్వాల పెద్ద జాతరగా పిలువబడే చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలకు గద్వాల చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు కర్ణాటక ప్రాంతానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని కొలుస్తారు. పెద్ద జాతర సందర్భంగా జమ్ములమ్మ ఉత్సవాలు ప్రారంభం కావడంతో గద్వాల ప్రాంతంలో భక్తుల రద్దీ నెలకొంటుంది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 4 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31న కల్యాణోత్సవం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డితోపాటు పట్టణ పుర ప్రముఖులు, జిల్లా అధికారులు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 1న అర్ధరాత్రి రథోత్సవం నిర్వహిస్తారు. రథోత్సవ కార్యక్రమానికి, అంతకు ముందు జరిగే పూజా కార్యక్రమాలు మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ శ్రీపాదుల ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు మంత్రాలయ పీఠాధిపతి హోమాలు, విశేష పూజలు, లింగంబావిలో తెప్పోత్సవం ఉంటుంది. శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో వనపర్తి జిల్లా న్యాయమూర్తి సునీత బ్రహోత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లు, బ్రోచర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో ఆలయ విచారణకర్త ప్రభాకర్, మేనేజర్ శ్రీపాదజోషి, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.


